బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఏ సంబంధమూ లేదు - రాహుల్ గాంధీ
విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం పారిస్ లోని సైన్సెస్ పీఓ యూనివర్శిటీలో విద్యార్థులు, విద్యావేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీపై పలు విమర్శలు చేశారు. బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఎలాంటి సంబంధమూ లేదని అన్నారు.

బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఎలాంటి సంబంధమూ లేదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని ఆరోపించారు. పారిస్ లో సైన్సెస్ పీఓ యూనివర్శిటీలో విద్యార్థులు, విద్యావేత్తలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఓ ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇస్తూ.. ‘‘హిందూ నేషనలిస్ట్ అనే పదానికి హిందూ మతంతో ఎలాంటి సంబంధం లేదు. నేను భగవద్గీత, ఉపనిషత్తులు చదివాను. అనేక హిందూ పుస్తకాలు చదివాను. బీజేపీ చేసే దానిలో హిందూ ఏమీ లేదు. నీకంటే బలహీనులను భయపెట్టాలని, హాని చేయాలని ఏ హిందూ పుస్తకంలోనూ, ఏ పండితుడైన హిందూ వ్యక్తి నుండి నేను వినలేదు. బీజేపీ ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది. అధికారం కోసం వారు ఏమైనా చేస్తారు.’’ అని ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులనుద్దేశించి రాహుల్ గాంధీ అన్నారు.
‘‘నాపై 24 కేసులు ఉన్నాయి. క్రిమినల్ పరువునష్టం కేసులో భారత్ లో ఎవరికైనా గరిష్ట శిక్ష పడటం ఇదే తొలిసారి. మేము ఈ సమస్యలను పరిష్కరిస్తున్నాము. ప్రజాస్వామ్య వ్యవస్థలను సజీవంగా ఉంచే పోరాటంలో మేం భాగస్వాములం. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అస్థిరతను ఎదుర్కొంటున్నాం’’ అని అన్నారు.
భారత్-ఇండియా పేరు మార్పు వివాదంపై రాహుల్ గాంధీ తన అభిప్రాయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతిపక్ష కూటమికి ‘ఇండియా’ అనే పేరు ఉన్నందునే ప్రభుత్వం దేశానికి భారత్ అని పేరు మార్చాలని చూస్తోందని ఆరోపించారు. ‘‘ రాజ్యాంగం రెండు పేర్లను వాడుకుంటోంది. ఇందులో నాకు ఏ సమస్యా కనిపించడం లేదు. రెండు పేర్లు ఆమోదయోగ్యమే. కానీ మా కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వానికి చికాకు కలిగించామని నేను అనుకుంటున్నాను. ఇంకా లోతుగా ఏదో జరుగుతోంది. పేరు మార్చాలనుకునే వ్యక్తులు ప్రాథమికంగా చరిత్రను తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. మన దేశ చరిత్ర భావితరాలకు తెలియాలని వారు కోరుకోవడం లేదు’’ అని అన్నారు.