మన దేశంలో తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు నమోదైంది. ముంబయిలో 50 ఏళ్ల మహిళకు ఈ వేరియంట్ సోకింది. ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2ల హైబ్రిడ్ వేరియంటే.. ఈ ఎక్స్ఈ వేరియంట్. ఈ వేరియంట్ ప్రపంచంలోని పలు దేశాల్లో కలకలం రేపుతున్నది. ఈ నేపథ్యంలోనే దీని తీవ్రత, లక్షణాలు, సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2లతో ఏర్పడిన హైబ్రిడ్ వేరియంటే ఈ ఎక్స్ఈ వేరియంట్. ఇప్పటి వరకు వెలుగుచూసిన అన్ని కరోనా వైరస్‌ల కంటే కూడా ఎక్స్‌ఈ అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది వరకే వెల్లడించింది. ఈ వేరియంట్ యూకే సహా పలు దేశాల్లో కేసుల సునామీ సృష్టించింది. ఇప్పుడు ఈ వేరియంట్ మన దేశంలోకీ ఎంటర్ అయింది. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరి 10న మన దేశంలోకి వచ్చిన 50 ఏళ్ల మహిళకు ఈ హైబ్రిడ్ వేరియంట్ ఎక్స్‌ఈ పాజిటివ్ అని తేలింది. మన దేశంలో తొలి ఎక్స్‌ఈ కేసు ముంబయిలో రిపోర్ట్ అయింది. ఈ సందర్భంగానే కొత్త వేరియంట్ గురించిన ఆందోళనలు మొదలయ్యాయి. ఈ వేరియంట్ తీవ్రత ఎలా ఉండనుంది? దాని లక్షణాలు? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటనే విషయాల గురించి చర్చ మొదలైంది. ఈ వేరియంట్ గురించిన కీలక విషయాలను తెలుసుకుందాం. అయితే, భారత్‌లోకి ఎక్స్‌ఈ వేరియంట్ కేసు నమోదైందన్న వార్తలను ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.
ఎక్స్‌ఈ వేరియంట్ అంటే ఏమిటీ?
కరోనా కేసులు తొలి సారి బీభత్సం సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు అది రూపాంతరం చెందుతూ కొత్త రూపాల్లో వచ్చి కేసులను మళ్లీ పెంచుతున్నది. తొలి వైరస్‌తోపాటు డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ప్రపంచ దేశాలను గడగడలాడించాయి. అయితే, ఈ వేరియంట్లతోపాటు ఇప్పుడు ఉప వేరియంట్ల హైబ్రిడ్‌లు కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మూడు హైబ్రిడ్ వేరియంట్లు ఉనికిలో ఉన్నట్టు చర్చ ఉన్నది. డెల్టా, ఒమిక్రాన్‌లకు చెందిన ఉప వేరియంట్ల హైబ్రిడ్ వేరియంట్లు రెండు ఉన్నాయి. కేవలం ఒమిక్రాన్ ఉపవేరియంట్లు బీఏ.1, బీఏ.2 వేరియంట్లకు సంబంధించిన హైబ్రిడ్ వేరియంట్ ఒకటి(ఎక్స్‌ఈ వేరియంట్) ఉన్నది. ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన రెండు ఉపవేరియంట్ల హైబ్రిడ్ వేరియంటే.. ఈ ఎక్స్ఈ వేరియంట్.
ఈ వేరియంట్‌ను ఎక్కడ గుర్తించారు?
జనవరి 19న యూకేలో ఈ ఎక్స్‌ఈ రీకాంబినెంట్‌ను తొలిసారి గుర్తించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది.
ఎక్స్‌ఈ వేరియంట్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నది?
భారత్‌లో బుధవారం తొలి ఎక్స్ఈ వేరియంట్ కేసు రిపోర్ట్ అయింది. ఆమె ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి వచ్చారు. ఇక్కడ అరైవల్‌లో ఆమె కరోనా పరీక్షలో నెగెటివ్ అనే తేలింది. యూకే కాకుండా థాయ్‌లాండ్, న్యూజిలాండ్‌లలోనూ ఈ వేరియంట్ నమోదైంది.
ఎంత వేగంతో వ్యాపిస్తుంది?
కరోనా వైరస్ గత వేరియంట్లు అన్నింటి కంటే కూడా ఎక్స్‌ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.2తో పోల్చితే 10 రెట్లు వేగంగా వ్యాపించే ముప్పు ఉన్నదని ప్రాథమిక అంచనాలు చెబుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
ఎక్స్‌ఈ వేరియంట్ లక్షణాలేవీ?
ఎక్స్‌ఈ వేరియంట్ సోకితే.. జ్వరం, గొంతులో మంటలు, గొంతు గరగరమనడం, దగ్గు, జలుబు, చర్మంపై దురద, రంగు మారడం, ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు వంటి లక్షణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.
దీని తీవ్రత ఎంత?
ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్, దాని ఉపవేరియంట్లు ఎక్కువ తీవ్రతను చూపించలేవు. ఇది కూడా ఎక్కువ తీవ్రతను చూపించే ఆధారాలు ఇప్పటికైతే లేవు. అయితే, ఇప్పుడే ఈ వేరియంట్ తీవ్రతపై ఓ అంచనాకు రాలేమని నిపుణులు చెబుతున్నారు.
టీకా పని చేస్తుందా?
కరోనా టీకాలు ఎక్స్ఈ వేరియంట్‌పైనా ప్రభావవంతంగా పని చేస్తుంది. హాస్పిటలైజేషన్‌ను తగ్గించడం, సమస్య తీవ్రతను తగ్గించడం, మరణాలను చాలా వరకు నివారించగలదని నిపుణులు చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్ నుంచి టీకా సంపూర్ణ భద్రతను మాత్రం ఇవ్వదు. రెండు డోసుల టీకా వేసుకున్నవారు.. ఎక్స్ఈ వేరియంట్‌ను ఏ స్థాయిలో ఎదుర్కొనగలరనే విషయంపై ఇప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ జాగ్రత్తలు ముఖ్యం
మాస్కు తప్పక ధరించాలి. ఇతరులతో కనీసం ఒక మీటర్ దూరాన్ని పాటించాలి. వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతాల్లో ఉండరాదు. అలాగే, ఎక్కువ మంది గుమిగూడి ఉన్న చోట్లకూ వెళ్లకపోవడం ఉత్తమం. తరుచూ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. లేని పక్షంలో కనీసం శానిటైజ్ చేసుకోవాలి. ఇప్పటికీ రెండో డోసు తీసుకోకుంటే.. తీసుకోవాలి. అర్హులైతే.. బూస్టర్ డోసు కూడా వేసుకోవాలి.
