Asianet News TeluguAsianet News Telugu

పండోరా పేపర్లు: పండోరా పేపర్లు ఏమిటీ? దేని గురించి వివరిస్తున్నాయి? వాటి అవసరమేంటి?

పన్నులపై కఠిన నిబంధనలు లేని దేశాల్లో కంపెనీలు, ట్రస్టులు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆస్తులు కూడబెట్టుకోవడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం జరుగుతున్నాయి. ఈ విషయాలను తాజాగా పండోరా పేపర్లు వెల్లడించాయి. ఇంతకీ ఈ పండోరా పేపర్లు ఏమిటీ? అవి ఎలా వచ్చాయి. 
 

what are pandora papers and why these papers matters
Author
New Delhi, First Published Oct 4, 2021, 1:33 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

న్యూఢిల్లీ: ఒక్కో దేశానిది ఒక్కో విధానం. పన్నులపై కొన్ని దేశాలు కఠినంగా వ్యవహరిస్తుంటే కొన్ని చూసీచూడనట్టుగా ఉదాసీనంగా ఉంటాయి. బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి కొన్ని దీవులు, దేశాల్లో పన్నులపై నిబంధనలు చాలా తక్కువ. అంతేకాదు, వీటి విషయాలు బయటికి చెప్పడంపై మాత్రం కఠినమైన చర్యలుంటాయి. అదిగో.. ఇలాంటి ప్రాంతాలు, దేశాలు పన్ను ఎగవేతదారులకు ఉత్తమైన దేశాలుగా మారుతున్నాయి. అత్యధిక ధనికులు, సంపన్నులు, పేరుప్రఖ్యాతలు గడించి అపార సంపదలున్న నేతలు, వ్యాపారవేత్తలు వారు నివసిస్తున్న దేశాల ప్రభుత్వాలు విధించే పన్నులను తప్పించుకోవడానికి ఈ దేశాలను ఆశ్రయిస్తున్నారు. కేవలం పన్ను ఎగవేయడానికే కాదు, మనీలాండరింగ్, తప్పుడు విధానాల్లో ఆర్జించిన సొమ్మునూ ఎవరికీ తెలియకుండా ఇక్కడ గోప్యంగా ఉంచుతున్నారు.

ఇలాంటి దేశాల్లో ఓ డొల్ల కంపెనీ లేదా ట్రస్టును ఏర్పాటు చేసి వ్యవహారాలు నడిపించవచ్చు. తద్వార ఆ డబ్బు ఎవరిది? దాని ద్వారా ఏం చేస్తున్నారు? అనే విషయాలు బయటి ప్రపంచానికి తెలియవు. పన్ను నిబంధనలు శూన్యంగా లేదా చాలా స్వల్పంగా ఉన్న దేశాల్లో డొల్ల కంపెనీలు, ట్రస్టులను ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా గ్లోబర్ కార్పరేట్ సేవలందించే కంపెనీలు ఉంటాయి. అదిగో ఇలాంటి 14 కంపెనీల నుంచే 1.19 కోట్ల డాక్యుమెంట్లు లీక్ అయ్యాయి. వాటిని నెలల తరబడి పరిశోధించి ప్రచురించిన పత్రాలే పండోరా డాక్యుమెంట్స్. ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు(ఐసీఐజే) కింద బీబీసీ, వాషింగ్టన్ పోస్టు, ది గార్డియన్ సహా పలుదేశాల మీడియా సంస్థల ప్రతినిధులు ఈ పరిశోధనలు చేశారు. ఈ లీక్‌ అయిన డాక్యుమెంట్లలో ఎందరో ప్రఖ్యాత రాజకీయవేత్తలు, కొన్ని దేశాల్లో ఇప్పుడు అధికారాన్ని వెలగబెడుతున్నవారూ ఉన్నారు. సుమారు 330 మంది ప్రముఖ రాజకీయ నాయకులున్నారని తెలిసింది. భారత్ నుంచీ 380 మంది ఈ జాబితాలో ఉన్నట్టు తేలింది. పాకిస్తాన్ నుంచి 700 మందికిపైగానే ఉన్నారు.

విమానాలు, షిప్పులు, భవంతులు, రియల్ ఎస్టేట్, షేర్ హోల్డింగ్‌లు, పెయింటింగ్‌లు ఈ డొల్ల కంపెనీల ద్వారా పన్ను కట్టకుండా సొంతం చేసుకోవచ్చు. ఉదాహరణకు టోనీ బ్లెయిర్, ఆయన భార్య చెరీలు తప్పుడు మార్గంలో ఓ భవంతిని కొనుగోలు చేసి   3,12,000 పౌండ్‌ల పన్నును తప్పించుకున్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. లండన్ టౌన్‌హౌజ్‌ను 6.45 మిలియన్ పౌండ్లు పెట్టి కొనుగోలు చేశారు. దీన్ని నేరుగా కొనుగోలు చేయలేదు. ఆ భవంతిని కలిగి ఉన్న ఓ విదేశీ సంస్థను కొనుగోలు చేశారు. తద్వార భవంతిని కొనుక్కున్నారు. దీని ద్వారా స్టాంప్ డ్యూటీల కింద 3.12లక్షల పౌండ్‌లు తప్పించుకున్నారు. కొందరు ఇలాంటి కంపెనీలు, ట్రస్టుల ద్వారా మనీలాండరింగ్ కూడా చేస్తున్నట్టు తెలిసింది. వీటిని ఇతర విధ్వంస కార్యకలాపాలకూ వినియోగించుకునే అవకాశాలు లేకపోలేదు.

విదేశాల్లో ట్రస్టు పెట్టినవారంతా తప్పు చేసినట్టే అనుకోలేం. కొందరు జెన్యూన్ కారణాలతోనే ట్రస్టులు పెట్టవచ్చు. కానీ, ఐసీఐజే పరిశోధనలో చాలా మంది వీటిని ప్రధానంగా రెండు లక్ష్యాల కోసం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తున్నది. తమ నిజమైన గుర్తింపును (Identity)ని దాచిపెట్టడానికి తద్వార ఆ విదేశీ సంస్థకు తమకు సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. దీంతో పన్ను అధికారులు వారిని కనుగొనడం కష్టసాధ్యమవుతుంది. రెండోది, క్యాష్, షేర్‌హోల్డింగ్, రియల్ ఎస్టేట్, ఆర్ట్, ఎయిర్‌క్రాఫ్ట్, షిప్పు‌లనూ సేఫ్‌గా ఉంచుకోవడానికి వినియోగిస్తున్నట్టు అర్థమవుతున్నది. లా, బ్యాంకు సంస్థలు కలిసి నడవడం మూలంగానే ఇలాంటి సరికొత్త విధానాలు ముందుకు వస్తున్నట్టు తెలుస్తున్నది.

పండోరా పేపర్ల కంటే ముందు పనామా, ప్యారడైజ్, ఫిన్‌సెన్ పేపర్లూ వచ్చాయి. ముఖ్యంగా పనామా, ప్యారడైజ్ పేపర్లు ప్రపంచ రాజకీయాలను కుదిపేశాయి. ఆ పేపర్లు కూడా పన్ను ఎగవేతదారుల వివరాలనే బహిర్గతం చేశాయి. వ్యక్తిగతంగా విదేశాల్లో అంటే పన్ను ఎగవేతదారులకు స్వర్గదామాలుగా నిలుస్తున్న సమోవా, పనామా, బెలీజ్, కేమాన్ దీవులు, బ్రిటన్ వర్జిన ఐలాండ్స్ వంటి దేశాల్లో షెల్ కంపెనీలు నెలకొల్పిన విషయాలను పనామా పేపర్లు వెల్లడించాయి. తర్వాత వ్యక్తిగతంగా కాకుండా సమూహంగా విదేశాల్లో సంస్థలను నెలకొల్పిన వారి విషయాలను ప్యారడైజ్ బట్టబయలు చేసింది. పన్నులపై చాలా దేశాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ట్రస్టుల బాట పట్టాయి. ఈ ట్రస్టుల బాగోతాన్ని పండోరా పత్రాలు వెల్లడించాయి. స్థూలంగా స్వదేశాల్లో పన్ను కట్టకుండా విదేశాల్లో డబ్బు పోగుచేసుకునే వారి వివరాలను ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios