Asianet News TeluguAsianet News Telugu

మాస్క్ లేకుండా ప్రయాణం.. రూ.21లక్షల జరిమానా వసూలు..!

మాస్కులు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానా కింద రూ. 21.53 లక్షలు వసూలు చేసినట్టు ఇవాళ పశ్చిమ రైల్వే వెల్లడించింది

Western Railway collects over Rs 21 lakh fine from passengers travelling without mask
Author
Hyderabad, First Published Apr 21, 2021, 4:22 PM IST

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఈ మహ్మారికి దూరంగా ఉండేందుకు ప్రజలంతా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నాయి.  అయినప్పటికీ చాలా మంది ఆ మాటలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. మాస్క్ ధరించని వారి వద్ద నుంచి జరిమానా వసూలు చేయడం మొదలుపెట్టారు. రైలులో ప్రయాణికుల వద్ద నుంచి కూడా మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది.

మాస్కులు లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారి నుంచి జరిమానా కింద రూ. 21.53 లక్షలు వసూలు చేసినట్టు ఇవాళ పశ్చిమ రైల్వే వెల్లడించింది. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సంయుక్త సహకారంతో ఏప్రిల్ 20 వరకు రైల్వే శాఖ 12 వేల మందికి జరిమానా విధించినట్టు తెలిపింది. మంగళవారం నాటికి మొత్తం 12,824 మందికి జరిమానా విధించగా... అందులో కేవలం మార్చిలోనే 6,972 మంది మాస్క్ లేకుండా పట్టుబడినట్టు రైల్వేశాఖ పేర్కొంది. 

వీరి నుంచి 10,93,500 జరిమానా వసూలు చేసినట్టు వెల్లడించింది. ఫిబ్రవరిలో మాస్క్ ధరించకుండా ప్రయాణిస్తున్న 4,017 మంది నుంచి అధికారులు రూ.6,29,600 మేర జరిమానా వసూలు చేశారు. కాగా ఈ నెలలో నిన్నటి వరకు 1,835 మంది పట్టుబడగా.. వారి నుంచి రూ.4,30,500 వసూలు చేశారు.  మహారాష్ట్రలో గడచిన 24 గంటల్లో 58,924 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వివిధ ఆస్పత్రుల నుంచి 52,412 మంది కోలుకోగా... 351 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios