Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ ముఖ్య సంస్థ‌లుగా కేంద్ర ద‌ర్యాప్తు ఏజెన్సీలు అంటూ టీఎంసీ విమ‌ర్శ‌లు

Trinamool Congress: కేంద్ర ద‌ర్యాప్తు ఏజెన్సీలు బీజేపీ సంస్థ‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. అలాగే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స‌ర్కారు ఏజెన్సీల‌ను దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆరోపిస్తున్నాయి. 
 

West Bengal: TMC criticises central investigative agencies acting as BJP's organisations
Author
Hyderabad, First Published Aug 13, 2022, 2:44 PM IST

West Bengal:  గ‌త కొన్ని రోజులుగా ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు చెందిన నేత‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు పెరుగుతున్న క్ర‌మంలో పొలిటిక‌ల్ హీట్ పెరుగుతోంది. కేంద్రంలోని అధికారంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ప్ర‌భుత్వం ప్ర‌తిప‌క్షాల‌ను లక్ష్యంగా చేసుకునీ, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తున్న‌ద‌ని ఆరోపిస్తున్నాయి. ద‌ర్యాప్తు ఏజెన్సీలు ఇటీవ‌ల కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను ఈడీ ప్ర‌శ్నించ‌డంతో మ‌ళ్లీ ఈడీ,సీబీఐ వంటి ద‌ర్యాప్తు సంస్థ‌ల‌  అంశం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో ప‌శువుల అక్ర‌మ ర‌వాణా కేసులో తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయ‌కుడు అనుబ్రతా మోండల్ అరెస్టు ప‌శ్చిమ బెంగాల్ లో పొలిటిక‌ల్ హీట్ పెంచింది. ఆయ‌న అరెస్టు నేప‌థ్యంలోనే శుక్ర‌వారం నాడు అధికారం, ప్ర‌తిప‌క్ష పార్టీల‌ ర్యాలీలు-కౌంటర్ ర్యాలీలు పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడిని మ‌రింత‌గా పెంచాయి.  రాష్ట్ర అధికార పార్టీ  దర్యాప్తు సంస్థ నిష్పాక్షికతను ప్ర‌శ్నించాయి. ప్ర‌తిప‌క్ష శిబిరాలు చెడు మీద మంచి... అంటూ విజయోత్సవం జరుపుకుంటున్నాయి. 

కాగా, పశువుల స్మగ్లింగ్ కేసు దర్యాప్తులో సహకరించలేదన్న ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) గురువారం ఉదయం అనుబ్ర‌తా మోండల్‌ను బీర్భూమ్ జిల్లాలోని బోల్పూర్ ప్రాంతంలోని అతని నివాసంలో వుండ‌గా, కేంద్ర ఏజెన్సీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.  ఆ తర్వాత ప్రత్యేక సీబీఐ కోర్టు అతడిని కేంద్ర ఏజెన్సీకి 10 రోజుల కస్టడీకి అప్ప‌గించింది.  అయితే, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లు కేంద్రంలో అధికారంలో ఉన్న‌బీజేపీకి చెందిన ముఖ్య సంస్థలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ తృణ‌మూల్ కాంగ్రెస్ (టీఎంసీ) శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నిరసన ర్యాలీలు చేపట్టింది. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిన‌దించింది. పోస్టర్లు, ప్లకార్డులు పట్టుకుని టీఎంసీ విద్యార్థి, యువజన విభాగం సభ్యులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహించి ఈడీ, సీబీఐతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

“కేంద్ర ఏజెన్సీల పనితీరుపై మాకు తీవ్రమైన సందేహాలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలపై చర్యలు తీసుకునే విషయంలో వారు మౌనం వహించడం మనం చూశాం’’ అని తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ (టీఎంసీపీ) రాష్ట్ర అధ్యక్షుడు త్రినాంకుర్ భట్టాచార్జీ అన్నారు.  బీజేపీ నేతలపై అక్రమాస్తుల కేసుల విషయంలో కేంద్ర సంస్థలు నిదానంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. "బీజేపీ నేతలపై ఇలాంటి కేసులు,  దర్యాప్తు సంస్థల బారి నుంచి తప్పించుకునేందుకు కాషాయదళంలో చేరిన వారిపై ఏమంటారో" అని ఆయన ప్రశ్నించారు. ప్ర‌తిప‌క్షాలు, అధికార పార్టీ నేత‌ల విషయంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అనుబ్రతా మోండల్ స్వస్థలం బీర్భూమ్‌తో పాటు తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్, పురూలియా, సిలిగురి, బంకురా, కోల్‌కతాతో సహా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిరసన ర్యాలీలు జరిగాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌తిప‌క్ష బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కౌంటర్ ర్యాలీలు నిర్వహించాయి. టీఎంసీకి  చెందిన మొత్తం ఉన్నతాధికారులు అవినీతిపై కటకటాల వెనక్కి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని పేర్కొన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios