కోల్ కతా: పలువురు మహిళలపై అత్యాచారం చేసి, వారిని హత్య చేసిన కేసులో 38 ఏళ్ల వ్యక్తికి పశ్చిమ బెంగాల్ లోని బుర్దవాన్ జిల్లా కోర్టు మరణశిక్ష విధించింది. దోషి కమరుఝ్ఝమన్ కు చైన్ కిల్లర్ గా పేరుంది. మహిళలను అతను సైకిల్ చైన్లతో గొంతు నులిమి చంపేవాడు. 

అతనికి మరణశిక్ష విధిస్తూ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి తపన్ కుమార్ మండల్ తీర్పు చెప్పారు. తాను ప్రభుత్వాధికారినంటూ అతను ఇళ్లలోకి ప్రవేశించి సైకిల్ చైన్ తో గొంతు బిగించి చంపేవాడు. దాంతో అతనికి చైన్ మ్యాన్ అనే పేరు కూడా వచ్చింది.

తన టార్గెట్లను అతను చాలా జాగ్రత్తగా ఎంచుకునేవాడు. ఇళ్లలో ఒంటరిగా ఉండే మహిళలను ఎంచుకుని అతను దాడి చేసేవాడు. దర్జాగా దుస్తులు ధరించి, విద్యుత్తు బిల్లును నోట్ చేసుకున్నట్లు ప్రవేశించి మహిళలపై దాడి చేసేవాడు. మహిళ ఒంటరిగా ఉందని తెలియగానే చైన్ తో గొంతు బిగించి, తలపై ఇనుప రాడ్ తో కొట్టి చంపేవాడు. 

తాను పలువురు మహిళలపై లైంగిక దాడి చేసినట్లు అతను విచారణలో అంగీకరించాడు. కొంత మంది మహిళలు తన దాడి నుంచి తప్పించుకున్నట్లు కూడా తెలిపాడు. బాధితుల ఇళ్లలోని విలువైన వస్తువులను అప్పుడప్పుడు తీసుకుని వెళ్లేవాడు. అయితే, అతని ఉద్దేశం దొంగతనం చేయడం కాదు. 

ముర్షిదాబాదు జిల్లాకు చెందిన సరార్ కు వివాహమైంది. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారిలో ఇద్దరు కుమారులు, ఓ కూతురు. అతను స్క్రాప్ మెటల్ వర్క్ చేసేవాడు.