కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. తాజాగా టీకా సర్టిఫికెట్ కు సంబంధించిన విషయంలో వీరిద్దరూ మళ్లీ తలపడుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి టీకా సర్ఠిఫికెట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 

దీని మీద ప్రధాని మోదీ ఫొటో ఉంటుంది. అయితే, పశ్చిమ బెంగాల్ లో టీకా సర్టిఫికెట్ మీద పీఎం మోదీ ఫొటోను తొలగించారు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫొటోను ముద్రించారు. దీంతో బీజేపీ దీనిమీద అభ్యంతరం చెబుతోంది. 

కోల్ కతాలో టీకా ఆన్ వీల్స్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఒక బస్సును మొబైల్ కరోనా టీకా కేంద్రంగా మార్చారు. ఈ బస్సు ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు టీకాలు వేయనున్నారు. ఈ సందర్భంగా బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ మాట్లాడుతూ టీకా సర్టిఫికేట్ మీద సీఎం మమత ఫొటో ప్రచురించడంలో తప్పు లేదన్నారు. 

కాగా గతంలో తృణమూల్ కాంగ్రెస్.. టీకా సర్టిఫికేట్ లో ప్రధాని మోదీ ఫొటో ఉండటంమీద అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిమీద ఆ పార్టీ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని బీజేపీ ఉల్లంగించిందని ఆరోపించింది. 

కాగా ఈ ఉదంతంపై బీజేపీ రాష్ట్ర ప్రతినిధి సామిక్ భట్టాచార్య మాట్లాడుతూ మన పార్లమెంటరీ వ్యవస్థలో ప్రధానమంత్రికి ప్రత్యేక స్థానం ఉందని, దానిని ముఖ్యమంత్రి పరం చేయాలని టీఎంసీ భావిస్తున్నదని ఆరోపించారు. కాగా టీకా సర్టిఫికెట్ పై బెంగాల్ మాత్రమే కాకుండా కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ప్రదాని మోదీ ఫొటోను తొలగించాయి.