పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నదని. టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు చేపట్టారని రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీని అరెస్టు చేసింది. దీనిపై టీఎంసీ స్పందిస్తూ బీజేపీ కుట్రపూరిత చర్యలు అని పేర్కొంది. ఒక వేళ పార్థ చటర్జీ దోషిగా తేలితే తాము చర్యలు తీసుకుంటామని తెలిపింది. 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ చటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. మనీలాండరింగ్ అభియోగాల కింద అరెస్టు చేసింది. ఈ అరెస్టును అధికార పార్టీ టీఎంసీ ఖండించింది. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రాజకీయ కక్ష్క్ష్యలకు దుర్వినియోగం చేస్తున్నదని విమర్శించింది. అంతేకాదు, ఒక వేళ తమ మంత్రి దోషిగా తేలితే చర్యలు తీసుకుంటామని వివరించింది.

పార్థ చటర్జీ సన్నిహిత వ్యక్తి అర్పిత ముఖర్జీ ఇంటిలో ఈడీ దాడిలో రూ. 20 కోట్లు బయటపడ్డాయి. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన గంటల వ్యవధిలోనే పార్థ చటర్జీని, ఆయన సన్నిహిత మనిషిని టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసింది.

ఈ పరిణామాలపై టీఎంసీ సీనియర్ నేత పిర్హద్ హకీం స్పందించారు. తాము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని అన్నారు. న్యాయవ్యవస్థ తీర్పు వచ్చిన తర్వాతనే తదుపరిగా తాము చర్యలు తీసుకుంటామని చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్.. ప్రభుత్వంలోనైనా.. పార్టీలోనైనా అవకతవకలను ఉపేక్షించదని అన్నారు. అయితే, తాము మాత్రం ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటకంగానే చూస్తున్నామని వివరించారు. బీజేపీలోకి చేరినవారిని టచ్ కూడా చేయడం లేదని, ఎవరైతే తమతోనే ఉండిపోయారో వారినే టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.

69 ఏళ్ల పార్థ చటర్జీ ప్రస్తుతం ఇండస్ట్రీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలకు బాధ్యతలు వహిస్తున్నారు. 2014 నుంచి 2021 కాలంలో ఆయన విద్యా శాఖ మంత్రిగా వ్యవహరించారు. అదే కాలంలో విద్యాశాఖలో అవకతవకలు జరిగాయని ఈడీ ఆయనను అరెస్టు చేసిందని తెలిపారు.

కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గ్రూప్ సీ, గ్రూప్ డీ సిబ్బంది, ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలను దర్యాప్తు చేస్తున్నది. ఈ కేసులో డబ్బు ఎలా వచ్చింది? అనే కోణాన్ని ఈడీ విచారిస్తున్నది.

ప‌శ్చిమ బెంగాల్‌లో టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ స్కాం ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఈ కుంభ‌కోణంలో బెంగాల్ క్యాబినెట్ మంత్రి, రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) శనివారం అరెస్టు చేసింది. ఈ క్ర‌మంలో పార్థ ఛటర్జీని రెండు రోజుల పాటు రిమాండ్ త‌ర‌లించాల‌ని ఈడీ కోర్టును ఆశ్రయించింది. ఈ విష‌యంలో కోర్టు ఆమోదం తెలపడంతో ఆయ‌న‌ను రెండు రోజుల పాటు ఈడీ రిమాండ్‌కు త‌ర‌లించారు.