పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను అరెస్టు చేసిన ఈడీ.. ఎందుకంటే ?
రేషన్ కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ఈడీ శుక్రవారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకుంది. గురువారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించి, మరుసటి రోజు ఈ చర్యకు పూనుకుంది.
పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ ను ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్టు చేసింది. రేషన్ కుంభకోణం కేసులో నేటి తెల్లవారుజామున ఆయనను అదుపులోకి తీసుకుంది. కోల్ కత్తా శివారులోని సాల్ట్ లేక్ లోని మంత్రి నివాసంలో కేంద్ర దర్యాప్తు సంస్థ గురువారం సోదాలు నిర్వహించింది. అది జరిగిన మరుసటి రోజే మమతా బెనర్జి మంత్రి వర్గ సహకచరుడిని అరెస్టు చేయడం గమనార్హం.
కాగా.. రేషనింగ్ పంపిణీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో మల్లిక్ ను ఈడీ అరెస్టు చేసింది. అయితే ఆయనను అరెస్టు చేసి, ఈడీ అధికారులు తరలిస్తుండగా మీడియాతో మాట్లాడారు. తాను తీవ్రమైన కుట్రకు బలైపోయానని వ్యాఖ్యానించారు.
కాగా.. మంత్రి మల్లిక్ తో సన్నిహిత సంబంధాలున్న ఓ వ్యాపారవేత్తను గత వారం కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బకిబుర్ రెహమాన్ అనే వ్యాపారికి పలు రైస్ మిల్లులు, హోటళ్లు, బార్లు ఉన్నాయని, అవి షెల్ కంపెనీలుగా పనిచేస్తున్నాయని తెలిపింది. రెహమాన్ అక్రమంగా రూ.50 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఈడీ పేర్కొంది.
కాగా.. జ్యోతిప్రియ మల్లిక్ ప్రస్తుతం రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. మల్లిక్ గతంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. టీఎంసీకి ఆయన సీనియర్ సభ్యుడిగా ఉన్నారు.