పశ్చిమ బెంగాల్‌లోని ఓ నైట్ క్లబ్‌లో పిల్ల కోతిని చైన్‌లతో కట్టేసిన దృశ్యం సోషల్ మీడియాలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ టాయ్ రూమ్ అనే నైట్ క్లబ్ పై విరుచుకుపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోల్‌కతా పోలీసులకూ ట్యాగ్ చేశారు. జంతువుల పట్ల ఆ క్లబ్ క్రూరంగా వ్యవహరించిందని ఆరోపించారు.
Nightclub: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ నైట్ క్లబ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా జంతు ప్రేమికులు విరుచుకపడుతున్నారు. ఆ క్లబ్ కస్టమర్ల కోసం మంకీని బంధించి చైన్‌లలో కట్టి ఉంచారని, అక్కడికి వచ్చిన కస్టమర్లూ చైన్‌లతో కట్టేసి ఉంచిన వానరాన్ని నిమిరి పోతున్నారని మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. కామాక్ స్ట్రీట్ ఏరియాలోని టాయ్ రూమ్ అనే నైట్ క్లబ్ సర్కస్ థీమ్‌తో ఓ పార్టీని శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రాంగణంలోనే చైన్‌లతో కట్టేసిన కోతి కనిపించింది.
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, టాయ్ రూమ్ ఈ ఆరోపణలను ఖండించింది.
టాయ్ రూమ్ యాజమాన్యం, మరికొందరు కలిసి జూన్ 16వ తేదీన సర్కస్ థీమ్ పార్క్ నిర్వహించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ సమయంలో ఒక కోతి పిల్లను చైన్‌లలో కట్టేసి ఆ జంతువు పట్ల క్రూరత్వం ప్రదర్శించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది.
Also Read: లిక్కర్ మత్తులో ఉన్న యూకే మహిళను ఫ్లాట్‌కు ఎత్తుకెళ్లి రేప్ చేసిన భారతీయ విద్యార్థి
ప్రముఖ బెంగాలీ యాక్టర్ స్వస్తికా ముఖర్జీ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ నిప్పులు చెరిగారు. ఈ విషయాన్ని చెప్పడానికి తాను సిగ్గుపడుతున్నట్టు వివరించారు. ఆమె అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌నూ ట్యాగ్ చేసింది. ఈ పార్టీకి వెళ్లిన వారికి ఏమొచ్చింది? అంటూ ప్రశ్నించి ఇలాంటి క్రూరమైన చర్యలో పాలుపంచుకున్నారని పేర్కొంది.
ఈ వీడియో స్వల్ప సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. టాయ్ రూమ్‌కు వ్యతిరేకంగా వెంటనే చర్యలు తీసుకోవాలని కోల్‌కతా పోలీసులకు నెటిజన్లు ట్యాగ్ చేశారు.
కాగా, ఈ ఆరోపణలను ఖండిస్తూ టాయ్ రూమ్ ఓ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. తమ ప్రాంగణంలోకి ఏ జంతువూ రాలేదని, ఏ జంతువుకూ హాని తలపెట్టలేదని వివరించింది. కొందరు మదరీలు రెస్టారెంట్ వెలుపల ప్రదర్శనకు వచ్చారని, వారు లోపలికి రావాలని విజ్ఙప్తి చేయగా తాము తిరస్కరించామని తెలిపింది. క్లబ్ గ్రౌండ్ లెవెల్ ఏరియాలో కోతలను ఆడించేవారు ఉన్నారని ఆ క్లబ్ తెలిపింది.
