పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ చీఫ్ అమిత్ షా తలపెట్టిన రథయాత్రను అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. రథయాత్రకు అనుమతి నిరాకరిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీజేపీ కోల్‌కతా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారించిన న్యాయస్థానం మమత సర్కార్ నిర్ణయాన్ని కొట్టివేసింది.

అయితే బీజేపీకి అనుకూలంగా ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఈ తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కాగా, కోల్‌కత్తా హైకోర్టు తీర్పు మేరకు ఈ నెల 28 నుంచి 31 వరకు ‘‘రథయాత్ర’’ నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్ర పేరిట మొత్తం 3 దశలుగా రాష్ట్రంలోని 42 నియోజకవర్గాల్లో రథయాత్ర నిర్వహించాలని బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు.

ఈ యాత్ర కారణంగా ట్రాఫిక్ సమస్యతో పాటు మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందంటూ బెంగాల్ ప్రభుత్వం బీజేపీ రథయాత్రకు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం వేసిన వేసిన పిటిషన్ ఇవాళ డివిజన్ బెంచ్ ముందుకు రానుండటంతో తీర్పు పట్ల బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.