teachers' recruitment scam: కోట్లాది రూపాయల డబ్ల్యూబీఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ అక్రమాలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు మాణిక్ భట్టాచార్యను (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఆయన కార్యాలయంలో సోదాలు నిర్వహించింది.
West Bengal SSC scam: పశ్చిమ బెంగాల్ ఎస్‌ఎస్‌సీ (టీచర్స్ రిక్రూట్ మెంట్) స్కామ్‌కు సంబంధించి అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించింది. ఈ స్కామ్ కు సంబంధించిన ఆయనను మంగళవారం నాడు ఈడీ అరెస్టు చేసింది,
మీడియా రిపోర్టుల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం (ఎస్‌ఎస్‌సీ స్కామ్)కు సంబంధించి అరెస్టయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ (డబ్ల్యూబీబీపీఈ) మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్య కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సోదాలు నిర్వహించిందని ఏఎన్ఐ నివేదించింది. ఈ రిక్రూట్ మెంట్ స్కామ్ లో కోట్ల రూపాయల అవకతవకలకు సంబంధించి మాణిక్ భట్టాచార్యను ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ అని పిలవబడే ఎస్‌ఎస్‌సీ స్కామ్ లో అక్రమాలకు సంబంధించిన ఆయనకు ఈడీ ఇప్పటికే పలు మార్లు సమాన్లు జారీ చేసిందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
అక్టోబరు 11న కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టు (పీఎంఎల్‌ఏ) ముందు హాజరైన భట్టాచార్యను అక్టోబర్ 25 వరకు 14 రోజుల పాటు ఈడీ కస్టడీకి పంపారు. ఎమ్మెల్యే అరెస్టు వారెంట్‌పై సంతకం చేయడానికి మొదట నిరాకరించారు. సీబీఐ అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు నుండి తనకు మధ్యంతర రక్షణ లభించిందని పేర్కొన్నారు. గత నెలలో సీబీఐ ఆయనను విచారించింది. కలకత్తా హైకోర్టు ఆదేశానుసారం, పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ ప్రాయోజిత పాఠశాలలకు ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించిన అనేక కోట్ల రూపాయల మనీలాండరింగ్ కుంభకోణంపై ఈడీ, సీబీఐ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నాయి.
జూలై 23న రాష్ట్ర మంత్రి పార్థ ఛటర్జీని, అతని సన్నిహిత సహచరురాలు అర్పితా ముఖర్జీని ఈడీ అరెస్టు చేసింది. పార్థ ఛటర్జీ, అర్పితా ముఖర్జీ, ఎచ్చయ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, అనంత టెక్స్‌ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్, సింబయాసిస్ మర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, వ్యూమోర్ హైరైజ్ ప్రైవేట్ లిమిటెడ్, ఏపీఏ యుటిలిటీ సర్వీసెస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. సెప్టెంబరు 19, 2022న, ఎనిమిది మంది నిందితులపై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్లు నిర్ధారించిన తర్వాత ప్రత్యేక కోర్టు ప్రాసిక్యూషన్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే రూ.49.80 కోట్ల విలువైన నగదు, రూ.5.08 కోట్లకు పైగా విలువైన బంగారం, ఆభరణాలు, రూ.48.22 కోట్ల విలువైన ఆస్తులు.. మొత్తం రూ.100 కోట్లకు పైగా ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్టు లైవ్ మింట్ నివేదించింది. కాగా, ఈడీ-సీబీఐ దాడుల నేపథ్యంలో అక్రమాలు వెలుగుచూడటం అక్కడి టీఎంసీ సర్కారుకు తలనొప్పిగా మారింది.
