కోల్‌కత్తా: చనిపోయిన వ్యక్తి వారం రోజులకు బతికి వచ్చాడు. చనిపోయాడని భావించిన వ్యక్తికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. అయితే వారం రోజుల తర్వాత చనిపోయాడని భావించాడని తెలిసి ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మోహిని మోహన్ ముఖర్జీకి 75 ఏళ్లు. ఆయనకు కరోనా సోకింది. చికిత్స కోసం బెనర్జీని ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబసభ్యులు.ఈ నెల 4వ తేదీన బెనర్జీ ఆసుపత్రిలో చేరాడు. ఈ నెల 13వ తేదీన బెనర్జీ చనిపోయాడని  కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేసి చెప్పారు. 

మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కరోనాతో మరణించడంతో కవర్లో చుట్టి కుటుంబ సభ్యులకు అప్పగించారు.  ఈ డెడ్‌బాడీకి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.వారం రోజుల తర్వాత బెనర్జీ కుటుంబానికి ఆసుపత్రి నుండి ఫోన్ చేశారు.  బెనర్జీ బతికే ఉన్నాడని చెప్పారు. 

మెడికల్ రిపోర్టులు మారిపోవడంతో ఈ సమస్య నెలకొందని బెనర్జీ కుటుంబసభ్యులకు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. మరో వ్యక్తి మృతదేహాన్ని బెనర్జీ మృతదేహం అంటూ ఇచ్చారు. బెనర్జీ కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించిన డెడ్ బాడీకి చెందిన కుటుంబసభ్యులు కూడా ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండు కుటుంబాల సభ్యులు ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.