కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ పీసీసీ చీఫ్ సోమెన్ మిత్రా గురువారం నాడు మరణించాడు. కిడ్నీ, గుండె జబ్బులతో ఆయన గురువారం నాడు ఉదయం మరణించాడు.
మిత్రా వయస్సు 78. ఆయన కొడుకు రోహన్ మిత్రా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు. భార్య సిఖా మిత్రా మాజీ ఎమ్మెల్యే.

సోమెన్ మిత్రా మరణించడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నట్టుగా సీఎం మమత బెనర్జీ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆమె తన సంతాపాన్ని తెలిపారు.
వారం రోజుల క్రితం అనారోగ్యంతో మిత్రా ఆసుపత్రిలో చేరారు. ఇప్పటికే రెండు సార్లు ఆయనకు డయాలసిస్ చేశారు. ఇవాళ  ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టుగా కుటుంబసభ్యులు తెలిపారు. 

సోమెన్ మిత్రా కుటుంబానికి, స్నేహితులకు తన మద్దతు ఉంటుందని మాజీ కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీ తెలిపారు. సోమెన్ మిత్రా చేసిన సేవలను గుర్తుంచుకొంటామని ఆయన ట్వీట్ చేశారు.

సెంట్రల్ కోల్ కత్తాలోని సీల్దా అసెంబ్లీ సెగ్మెంట్ నుండి ఆయన ఏడు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో తృణమూల్  తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొంత కాలానికే సోమెన్ మిత్రా తృణమూల్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు.

మిత్రా రెండు దఫాలు కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా పనిచేశారు. 1992 నుండి 1998 వరకు ఆయన తొలుత పీసీసీ చీఫ్ గా పనిచేశారు. ఆ సమయంలో మమత బెనర్జీ పార్టీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు.

ప్రజలకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న పాతతరం నేతల్లో సోమెన్ మిత్రా ఒకరని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ సలీం గుర్తు చేసుకొన్నారు.