Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీతో మమతా బెనర్జీ భేటీ.. రూ. 1 లక్ష కోట్ల నిధులు విడుదల చేయాలని డిమాండ్

ప్రధాని మోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రోజు సమావేశం అయ్యారు. ప్రధాని నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇందులో తమ రాష్ట్రానికి రావాల్సిన రూ. 1 లక్ష కోట్ల కేంద్ర నిధులను విడుదల చేయాలని మమతా బెనర్జీ మెమోరాండాన్ని ప్రధానికి సమర్పించారు.
 

west bengal cm mamata banerjee meets pm modi demands rs 1 lakh crore dues
Author
New Delhi, First Published Aug 5, 2022, 7:07 PM IST

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో మోడీకి మమతా బెనర్జీ ఒక మెమోరాండం సమర్పించారు. రాష్ట్రానికి రావాల్సిన రూ. 1,00,968.44 కోట్ల కేంద్ర నిధులను విడుదల చేయాలని అందులో డిమాండ్ చేశారు.

మమతా బెనర్జీ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఆమె తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం అయ్యారు. పార్లమెంటులో చర్చ గురించి మాట్లాడారు. 2024 లోక్‌సభ ఎన్నికల గురించీ చర్చించినట్టు తెలిసింది. ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ ఆమె భేటీ కాబోతున్నారు. అంతేకాదు, ఆగస్టు 7వ తేదీన ఆమె నీతి ఆయోగ్ మీటింగ్‌కూ హాజరు కాబోతున్నట్టు సమాచారం. అంతేకాదు, ప్రతిపక్ష నేతలతోనూ సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న సోనియా గాంధీని కూడా ఆమె కలుసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈడీకి పట్టుబడిన భారీ డబ్బుపైనే చర్చ జరుగుతున్నది. ఈడీ జరిపిన తనిఖీల్లో బెంగాల్ మాజీ మంత్రి పార్థ చటర్జీకి సన్నిహితమైన అర్పితా ముఖర్జీ నివాసంలో భారీ మొత్తంలో డబ్బు కట్టలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్‌లోనే బీజేపీ, టీఎంసీల మధ్య గట్టి వాగ్వాదం జరుగుతున్న సందర్భంలో మమతా బెనర్జీ ఈ రోజు ప్రధాని మోడీని కలిశారు. మోడీని కలువడం రాష్ట్రంలో బీజేపీకి కంటకంగా ఉన్నట్టు తెలుస్తున్నది. రాష్ట్ర బీజేపీ నేత దిలీప్ ఘోష్.. మమతా బెనర్జీ, ఆమె కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల విషయమై ఉభయ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్నది.

Follow Us:
Download App:
  • android
  • ios