పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలివితేటలను, మేధస్సును, భార్యలను అప్పు ఇవ్వరాదని, ఇస్తే.. రిఫండ్ ఉండదని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆమె విమర్శలను ఎదుర్కొంటున్నారు. బీజేపీ నేత అమిత్ మాలవీయా సీఎంపై విమర్శలు కురిపించారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జులై 7వ తేదీన ఆమె ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అక్కడ మాట్లాడుతూ, ఎవరికైనా తెలివి తేటలను, భార్యను అప్పుగా ఇవ్వొద్దు. ఇస్తే అవి తిరిగి రావు(రిఫండ్ అవెలేబుల్ ఉండదు) అనే అర్థంలో మాట్లాడారు.
మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఆమె మైండ్‌సెట్‌ను ప్రశ్నిస్తూ బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవియా ట్వీట్ చేశారు. భార్య ఏమైనా స్థిర ఆస్తినా? వారిని అప్పుగా ఇస్తారా? అని ప్రశ్నించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేస్తున్న వీడియోనూ ఆయన పోస్టు చేసి విమర్శలు సంధించారు.
అలాంటి వ్యాఖ్యలు స్త్రీల డిగ్నిటీని దిగజారుస్తాయని వివరించారు. మహిళలపై నేరాలకు సీఎం మైండ్‌సెట్ కారణమని ఆరోపించారు.
మమతా బెనర్జీ ఇలా మహిళలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. ఇప్పుడు ఆమె చేసిన ఈ సామెతనే గతంలోనూ ఒకసారి మాట్లాడి విమర్శల పాలయ్యారు. సుమారు దశాబ్ద కాలం క్రితం ఆమె కోల్‌కతా బుక్ ఫెయిర్‌లో ఓ సారి ఇవే వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు.
ఇదే ఏడాది బెంగాల్‌లో హంశకాలి రేప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపైనా ఆమె నోరుపారేసుకున్నారు. మైనర్ బాలికను రేప్ చేయడం కారణంగా మరణించిందని వీరంతా స్టోరీ ప్రసారం చేస్తున్నారని, దాన్ని మీరు రేప్ అనే పిలుస్తారా? అని అన్నారు. ఆమె గర్భం దాల్చిందా? లేక ఆమెకు లవ్ ఎఫైర్ ఉన్నదా? ఆ విషయాలను దర్యాప్తు చేశారా? అని ప్రశ్నించారు. తాను పోలీసులను ఆదేశించారని, వారు అరెస్టు చేస్తున్నారని అన్నారు. ఆ బాలికకు సదరు అబ్బాయితో ఎఫైర్ ఉన్నదని తనకు కొందరు చెప్పారని వివరించారు. అత్యాచారానికి గురై మరణించిన ఓ బాలిక గురించి ఇలా మాట్లాడటం అప్పట్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకువచ్చింది.
