PM Modi Bengal Visit: మోడీతో దీదీ భేటీ ..
PM Modi Bengal Visit: రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో ఉన్న ప్రధాని మోడీని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు.
PM Modi Bengal Visit: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బెంగాల్ పర్యటించారు. ఈ తరుణంలో ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. ప్రధాని మోదీని కలిసిన అనంతరం సీఎం మమత మాట్లాడుతూ.. ఇది ప్రోటోకాల్ సమావేశమని, మర్యాదపూర్వక సమావేశమని అన్నారు. తాను ఎలాంటి రాజకీయ విషయాలను చర్చించలేదని, రాజకీయ సమావేశం కాదని పేర్కొన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఇతర సమస్యలను ప్రస్తావించినట్టు చెప్పారు. రూ.1.18 లక్షల కోట్లు బకాయిలు రావాలంటూ సీఎం మమత రెండు రోజుల పాటు ధర్నాకు దిగడం, అంతేగాక జాతీయ ఉపాధి హామీ కూలీలకు మమత సర్కారే చెల్లింపులు చేయడం తెలిసిందే.
ప్రధాని విచారం
అంతకుముందు..బెంగాల్‌లోని ఆరంబాగ్‌లో పర్యటించిన ప్రధాని మోడీ 7200 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు, అలాగే.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సందేశ్‌ఖాలీలో జరుగుతున్న ఘటన యావత్ దేశాన్ని విషాదంలోకి నెట్టిందని ప్రధాని మోదీ అన్నారు. సందేశ్‌ఖాలీలో సోదరీమణులు, కుమార్తెల ధైర్యం అన్ని పరిమితులు దాటిందని అన్నారు. బెంగాల్‌లో టిఎంసి సర్కార్ నేరాలు, అవినీతికి కొత్త నమూనాగా మారిందని విమర్శించారు.
అవినీతిని ప్రోత్సహించింది
బెంగాల్ ప్రభుత్వం అవినీతిని ప్రోత్సహిస్తుందనీ, నేరాలను ప్రోత్సహిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేరస్థులకు రక్షణగా TMC నాయకులు నిలుస్తారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుందనీ, ఇందుకోసం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ లోని అన్ని స్థానాల్లో కమలం వికసించాల్సిన అవసరం ఉందని అన్నారు. తమకు నిర్దిష్టమైన ఓటు బ్యాంకు ఉందని TMC గర్విస్తోంది, కానీ ఈసారి TMC అహంకారాన్ని దించాలని అన్నారు.