ప్రవక్తపై వ్యాఖ్యల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో హౌరా జిల్లా ఆందోళనలతో అట్టుడుకుతున్నది. ఇక్కడ 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలనూ పోలీసులు అమలు చేస్తున్నారు. ఘర్షణలు జరుగుతున్న హౌరా జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేసిన బీజేపీ రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సుకంత మజుందార్‌ను పోలీసులు ముందు జాగ్రత్తగా అరెస్టు చేసినట్టు వివరించారు.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఆందోళనలతో అట్టుడికిపోతున్నది. ముఖ్యంగా హౌరా జిల్లాలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులపైనా ఆందోళనకారులు ఈ రోజు ఉదయం రాళ్లు విసిరారు. నిరసనకారులను చెల్లా చెదురు చేయడానికి పోలీసులు వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చింది. ఇక్కడ పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు 144 సెక్షన్‌ను పొడిగించారు. పరిస్థితులు ఇలా ఉండగా పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ చీఫ్ సుకంత మజుందార్ హౌరా జిల్లాకు ప్రయాణం కట్టారు. దీంతో పోలీసులు అలర్ట్ అయి ఆయన హౌరా జిల్లాకు చేరుకోకముందే అరెస్టు చేశారు.

హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న హౌరా జిల్లాకు వెళ్లే ప్రయత్నం చేసిన పశ్చిమ బెంగాల్ బీజేపీ యూనిట్ అధ్యక్షుడు సుకంత మజుందార్‌ను శనివారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ దీనాజ్‌పుర్‌లోని బలూర్‌ఘాట్‌ ఎంపీ అయిన సుకంత మజుందార్‌ను విద్యాసాగర్ సేతు దగ్గరలోని టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. హౌరా జిల్లాలో 144 సెక్షన్ అమలు అవుతున్నదని, అక్కడికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకంత మజుందార్‌ను అరెస్టు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వార్తా ఏజెన్సీ పీటీఐకి తెలిపారు. ఆయన పర్యటన కారణంగా అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తేదని వివరించారు. ఇది కేవలం ముందు జాగ్రత్తగా అవాంఛనీయలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల్లో మాత్రమే భాగం అని తెలిపారు.

బీజేపీ నేత నుపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు రాజేసిన మంటలు ఇంకా చల్లారడం లేదు. ఈ మంటలు పశ్చిమ బెంగాల్‌ను సైతం అట్టుడికిస్తున్నాయి. శుక్రవారం పెద్దమొత్తంలో ముస్లింలు ప్రేయర్‌కు హాజరై నుపుర్ శర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలు చేశారు. ముఖ్యంగా హౌరా జిల్లాలో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ వాయిలెన్స్‌కు సంబంధించి నిన్న రాత్రి నుంచి పోలీసులు సుమారు 70 మందిని అరెస్టు చేశారు. ఉలుబేరియా సబ్ డివిజన్‌లో 144 సెక్షన్ విధించారు. ఈ చర్యలను జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు.

ఇదిలా ఉండగా, శనివారం మళ్లీ ఆందోళనలు జరిగాయి. హౌరాలోని పంచలా బజార్‌లో ఈ ఆందోళనలు మొదలయ్యాయి. ఆందోళనలను అదుపులో ఉంచడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో ఆందోళనలను అదుపు చేయడానికి, నిరసనకారులను చెల్లాచెదురు చేయడానికి పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు.

ఈ ఘటనలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. తాను ఇది వరకే చెప్పినట్టుగా హౌరా జిల్లాలో రెండు రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఆరోపించారు. అవి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని వివరించారు. కానీ, ఈ చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అల్లర్లకు కారణమైన వారందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ పాపానికి ప్రజలు ఎందుకు బాధపడాలి? అని ప్రశ్నించారు.