ఉగ్రవాది కసబ్‌కు జైలులో నిజంగానే బిర్యానీ పెట్టారా? మాజీ పోలీసు అధికారి వెల్లడించిన సత్యమిదే
ముంబయి 26/11 పేలుళ్లలో సజీవంగా పట్టుబడ్డ పాకిస్తానీ టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్‌ను దర్యాప్తు, విచారణ కోసం జైలులో ఉంచినప్పుడు బిర్యానీ పెట్టారని, రాజభోగాలు కల్పించారని అప్పుడు విపరీతంగా ప్రచారమైంది. మన న్యాయవ్యవస్థ ఇంత సాఫ్ట్‌గా ఉంటుందనే విమర్శకు ఈ వాదనను ఉపయోగించుకున్నారు. కానీ, కసబ్‌కు బిర్యానీ పెట్టడం అవాస్తవ ప్రచారం అని మాజీ ఐపీఎస్ అధికారిని, కసబ్ ఉరిని పర్యవేక్షించిన పోలీసు అధికారిని మీరన్ చాద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో వెల్లడించారు.
న్యూఢిల్లీ: ముంబయి పేలుళ్ల(నవంబర్ 26, 2008) కేసులో సజీవంగా పట్టుబడ్డ ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరితీసిన సంగతి తెలిసిందే. అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్న ఓ పాకిస్తానీ ఉగ్రవాదిని జైలులో పెట్టి మటన్ బిర్యానీలు తినిపిస్తున్నారని అప్పట్లో విపరీతంగా ప్రచారం జరిగింది. చాలా మంది దీన్ని నిజమే అని నమ్మారు. ఇదే నిజం అని ఇప్పటికీ చాలా మందిలో ఉన్నది. అయితే, అజ్మల్ కసబ్ జైలులో ఉండగా ఆయనకు ఎలాంటి స్పెషల్ మీల్స్ పెట్టలేదని, బిర్యానీలూ కసబ్‌ను దగ్గరగా చూసిన, ఆయన ఉరిని పర్యవేక్షించిన మాజీ ఐపీఎస్ అధికారిని మీరన్ చాద్దా బోర్వాంకర్ తన పుస్తకంలో వెల్లడించారు.
పట్టుబడ్డ ఉగ్రవాదిని దర్యాప్తు పేరుతో జైలులో పెట్టి రాజభోగాలు కల్పిస్తున్నారని, బిర్యానీలు తినిపిస్తున్నారని పేర్కొంటూ భారత పీనల్ వ్యవస్థ ఇంత బలహీనంగా ఉన్నదనే ఒక వాదనను అప్పట్లో చేశారు. న్యాయవ్యవస్థపైనా ఈ వాదనతో కామెంట్లు చేశారు. కానీ, ఈ వాదనలు అవాస్తవాలని, శుష్క వాదనలేనని చీరన్ చాద్దా బోర్వాంకర్ పుస్తకంతో స్పష్టమైపోయింది.
కసబ్ ఉరి తీసే సమయంలో బోర్వాంకర్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ప్రిజన్స్)గా బాధ్యతల్లో ఉన్నారు. కసబ్‌తోపాటు 1993 ముంబయి వరుస పేలుళ్ల కేసులో దోషిగా యాకుబ్ మెమన్ ఉరినీ ఆమె పర్యవేక్షించారు. ముంబయిలోని ఆర్థర్ రోడ్ జైలులో కసబ్‌ను ఉంచారు.
‘జైలు సిబ్బంది, వైద్యులు సహా మేమంతా కసబ్ ఆరోగ్యం, డైట్ గురించి జాగ్రత్తగా ఉండేవాళ్లం. బయట ప్రచారం చేసినట్టుగా ఆయనకు బిర్యానీ లేదా ఇతర స్పెషల్ వంటకాలేవీ పెట్టలేదు.... తొలుత కసబ్ తన వ్యాయామంలోనే ఎక్కువ బిజీగా గడుపుతాడని నాకు చెప్పారు. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ ఆయన స్తబ్దుగా, నిశ్శబ్దంగా మారిపోయాడు. ఆయన చుట్టూ జరుగుతున్న వాటివేమీ ఆయన పట్టించుకునేవాడు కాదు. నా విజిట్‌లలో నేను ఆయనను ప్రశ్నిస్తే మౌనంగా ఉండేవాడు లేదా నవ్వి ఊరుకునేవాడు. కసబ్‌ను జైలుకు తెచ్చిన తొలినాళ్లలో జైలు సిబ్బందిలో మాత్రం ఆయన ఎంత హింసాపరుడు, ఎంతటి కోపిష్టో అని మాట్లాడుకునేవారు. కోర్టు ట్రయల్ మొదలైన కొన్ని నెలల తర్వాతే ఆయన పూర్తిగా మౌనం దాల్చాడు.’ అని బోర్వాంకర్ తెలిపారు.
Also Read: పాలస్తీనా ప్రెసిడెంట్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ‘మా వైఖరి మారదు’
‘మహారాష్ట్రలో అప్పటికి ఉరి శిక్ష అమలు చేసి 30 ఏళ్లు గడిచాయి. దాని ప్రొసీజిర్ ఎలా ఉంటుందా? అని తమ జ్ఞానాన్ని మరోసారి మెరుగుపెట్టుకున్నాం. ప్రిజన్ మ్యానువల్ దుమ్ముదులిపి మరోసారి తిరగేశాం. ప్రొసీజర్‌లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. .. కసబ్ ఉరి శిక్షను చాలా రహస్యంగా ఉంచాం. ఆయనను ఆర్థర్ రోడ్ జైలు నుంచి యెరవాడకు తరలించినట్టు ఓ రిపోర్టర్ కనుక్కున్నాడు. ధ్రువీకరించుకోవడానికి ఆయన ఓ సీనియర్ పోలీసు అధికారికి ఫోన్ చేశాడు. ఆయన తనకు తెలియదని సమాధానం చెప్పాడు. ఆ తర్వాత అప్పటి రాష్ట్ర హోం మంత్రి పాటిల్‌కు ఫోన్ చేయగా అదే సమాధానం చెప్పాడు. వీళ్లిద్దరూ నాకు ఈ విషయం చెప్పి అలర్ట్ చేశారు. ఆ తర్వాత అదే రిపోర్టర్ నాకు కూడా ఫోన్ చేయగా.. నీకు నీ సోర్స్ తప్పుడు సమాచారం చెప్పారని అన్నాను’ అని బోర్వాంకర్ వివరించారు.