పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పెళ్లికి ముందే వరుడి ప్రవర్తనతో ఆశ్చర్యపోయిన వధువు.. పెళ్లిని రద్దు చేసుకుంది.

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. అందుకే పెళ్లి విషయంలో పెద్దలు అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఈ ప్రయాణంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఎంతో ముఖ్యం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని పెళ్లికి ముందే వరుడి ప్రవర్తనతో ఆశ్చర్యపోయిన వధువు.. పెళ్లిని రద్దు చేసుకుంది. దీంతో వరుడు పెళ్లి లేకుండానే ఇంటికి తిరిగివెళ్లాల్సి వచ్చింది. వివరాలు.. మీర్జాపూర్ జిల్లాలోని మానిక్‌పూర్ గ్రామానికి చెందిన యువకుడికి టెండువా గ్రామానికి చెందిన యువతితో విహవాం కుదిరింది. 

ఈ క్రమంలోనే శుక్రవారం వివాహం ఉండటంతో.. వరుడు, అతడి బంధువులు టెండువా గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పెళ్లికి ముందు జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వరుడు, ఇతర బంధువులు వివాహ వేడుకల కోసం మండపానికి చేరుకున్నారు. వధువు కూడా అక్కడికి చేరుకుంది. అయితే అప్పటికే ఫుల్లుగా మద్యం తాగిన వరుడు.. తాగిన మైకంలో వధువుకు సిందూరం పెట్టలేకపోయాడు. అంతేకాకుండా ఆమెపై సిందూరం చల్లటం ప్రారంభించాడు.

దీంతో వధువుతో పాటు అక్కడున్నవారు షాక్ తిన్నారు. దీంతో అక్కడ కలకలం రేగింది.పెళ్లికి వధువు నిరాకరించింది. మండపం నుంచి ఇంటి లోపలికి వెళ్లింది. మరోవైపు పెళ్లికి వచ్చిన వరుడి బంధువులు అక్కడి నంచి పరుగులు తీశారు. అయితే గ్రామస్థులు వరుడిని, అతని తండ్రిని అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 

దీంతో పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. అక్కడ ఇరువర్గాలు పరస్పరం ఒప్పందం చేసుకున్నారు. ఇద్దరూ వివాహం చేసుకోకుండా విడిపోయారు. పెళ్లికి వధువు నిరాకరించిందని ఎస్‌ఓ రాజేష్‌కుమార్‌ తెలిపారు.