Rahul Gandhi: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించడాన్ని కాంగ్రెస్ అనుమతించబోదని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ అన్నారు. అలాగే, హిందీని మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
Bharat Jodo Yatra: ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడాన్ని తాను అంగీకరించనని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ రంగ యూనిట్ల (పీఎస్‌యూ) ప్రయివేటీకరణను అనుమతించబోదని ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, వయనాడ్ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ బుధవారం అన్నారు. అలాగే, హిందీని మాత్రమే జాతీయ భాషగా మార్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎత్తిచూపడంతో పాటు దేశంలో విభజన శక్తులను ఎదుర్కొవడానికి భారత్ ను ఏకం చేసే లక్ష్యంతో తాము దేశవ్యాప్త భారత్ జోడో యాత్ర చేస్తున్నామని ఇది వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే ఈ పాదయాత్ర ప్రస్తుతం కర్నాటకలో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర సందర్భంగా బుధవారం నాడు అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ వ్యూహరచన చేస్తుందని తెలిపారు. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కూడా పేర్కొన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ సంస్థలను ప్రయివేటీకరణకు తీసుకుంటున్న చర్యలను ఆయన తప్పుపట్టారు. “ప్రభుత్వ ఆస్తుల ప్రయివేటీకరణను నేను అంగీకరించను. మేము అధికారంలో ఉంటే మేము ప్రభుత్వ రంగ యూనిట్లను ప్రయివేటీకరణను అనుమతించబోము. అవి మెరుగైన పనితీరు కనబర్చేందుకు చర్యలు తీసుకుంటాం” అని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కర్ణాటక నలుమూలల నుండి నిరుద్యోగంపై సుమారు 1,800 మంది యువకులతో సంభాషించిన ఆయన, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించగలిగేది ప్రభుత్వ రంగ విభాగాలేనని అన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. "పబ్లిక్ సెక్టార్ యూనిట్లు పనిచేయడానికి సరైన స్థలం.. సరైన వాతావరణం ఇవ్వబడ్డాయి. అవి సరిగ్గా పనిచేయడానికి స్వేచ్ఛ ఇవ్వబడ్డాయి.. సంపూర్ణంగా పని చేస్తాయి" అని ఆయన అన్నారు.
ఉద్యోగాల కల్పనకు ఒక వ్యూహం ఉండాలని పేర్కొన్న రాహుల్ గాంధీ.. "ఉద్యోగాలు అలా సృష్టించబడవు.. మిలియన్ల మంది యువకులు ఉద్యోగాలు పొందేలా జాతీయ , రాష్ట్ర స్థాయిలో మేము ఒక వ్యూహాన్ని రూపొందిస్తాము అని చెప్పారు. ప్రభుత్వ రంగంలోని ఖాళీలను భర్తీ చేయడం ద్వారా మొదటి స్థానంలో ఉద్యోగాలు రావచ్చు.. దానికి తమ పార్టీ ఖచ్చితంగా కట్టుబడి ఉందని తెలిపారు. “అందువల్ల పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే మొదటి స్థానం వైద్యం..విద్య రంగాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారోగ్యం, ప్రభుత్వ విద్యపై ఎక్కువ డబ్బు ఖర్చు చేయబోతోంది.. ఇవి ప్రభుత్వ ఉద్యోగాల కల్పనను పెంచడంతో పాటు ప్రజా సంక్షేమంలో కీలకంగా ఉంటాయని తెలిపారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రయివేటు రంగ ఉద్యోగాలు చిన్న, మధ్యతరహా వ్యాపారాలు-చిన్న వ్యాపారుల నుండి వస్తాయని పేర్కొన్న రాహుల్ గాంధీ.. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరింత సమతుల్య విధానాన్ని కలిగి ఉంటుందనీ, చిరు-మధ్యతరహా వ్యాపారాలకు మద్దతు ఇస్తుందని తెలిపారు. వారికి బ్యాంకుల నుంచి ఆర్థికసాయం లభిస్తుందని కూడా పేర్కొన్నారు.
యువ పారిశ్రామికవేత్తలు వారి స్వంత వ్యాపారాలను నిర్మించుకోవడంలో సహాయపడటానికి తాము ప్రత్యేక ఆర్థిక సాధనాలను కూడా రూపొందిస్తామన్నారు. సామరస్యం లేని, శాంతియుతంగా లేని, హింసాత్మకంగా ఉండే సమాజం ఆర్థికంగా ఎదగదనీ, యువతకు ఉద్యోగాలు ఇచ్చి భవిష్యత్తును కలిగి ఉండదని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. కాగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్, కర్ణాటక ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ రణదీప్ సింగ్ సూర్జేవాలా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ సహా కాంగ్రెస్ ఇతర నాయకులు, పార్టీ శ్రేణులు రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో ముందుకు నడిచారు.
