బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న నాగేంద్రన్.. వీకే శశికళ తమ పార్టీలో చేరాలని నిర్ణయిచుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. 

బీజేపీ సీనియర్ నేత నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న నాగేంద్రన్.. వీకే శశికళ తమ పార్టీలో చేరాలని నిర్ణయిచుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పారు. నేడు Pudukottai‌లో ఓ వివాహా కార్యక్రమానికి హాజరైన నాగేంద్రన్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే గత కొంతకాలంగా తమిళనాడు అన్నాడీఎంకేను బీజేపీ నడిపిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.. మరోవైపు శశికళ కూడా అన్నాడీఎంకేలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. శశికళను బీజేపీలోని ఆహ్వానిస్తామని నాగేంద్రన్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. 

నాగేంద్రన్ విషయానికి వస్తే.. ఆయన గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. జయలలిత మరణం తర్వాత అప్పటి అధికార అన్నాడీఎంకేకు గుడు బై చెప్పిన నాగేంద్రన్.. కాషాయ కండువా కప్పుకున్నారు. అన్నాడీఎంకే నుంచి రాజకీయ ప్రస్తానం ప్రారంభించి.. ప్రస్తుతం బీజేపీలో కీలక నేతగా కొనసాగుతున్నారు. 

అసలు నాగేంద్రన్ ఏం అన్నారంటే..
నాగేంద్రన్ మాట్లాడుతూ.. ‘‘శశికళను ఏఐఏడీఎంకే వారి పార్టీలో చేర్చుకోవాలి. అది వారిని బలపరుస్తుంది. శశికళ చేరికను అన్నాడీఎంకే వ్యతిరేకిస్తే.. ఆమె ఒకవేళ బీజేపీలో చేరితే మేము స్వాగతిస్తాం. ఇది బీజేపీకి మద్దతు ఇస్తుంది’’ అని చెప్పారు. అదే సమయంలో అధికార డీఎంకేపై నాగేంద్రన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

జయలలిత మరణానంతరం ఆమె సన్నిహితురాలైన శశికళ.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు చేపట్టారు. తర్వాత కొద్ది రోజులకే అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. దీంతో శశికళపై ఓ పన్నీరు సెల్వం పోరుకు దిగారు. కొన్ని రోజుల తర్వాత శశికళ జైలుకు వెళ్లాల్సి రావడంతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత చోటుచేసుకన్న పరిణామాల నేపథ్యంలో.. ఓపీఎస్-ఈపీఎస్ టీమ్ ఒక్కటయ్యారు. శశికళను అన్నాడీఎంకే నుంచి తప్పించారు. ఏఐఏడీఎంకే జనరల్‌ కమిటీ కూడా ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికను రద్దు చేస్తూ తీర్మానం చేసింది.

అయితే ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలైన శశికళ అన్నాడీఎంకేలో తిరిగి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆధ్యాత్మిక యాత్ర పేరుతో రాష్ట్రంలోని వివిధ ఆలయాలను ఆమె సందర్శించారు. పలుచోట్ల తన మద్దతుదారులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. తన మద్దతుదారుల ఇంట్లో జరుగుతున్న కార్యక్రమాలకు సైతం శశికళ హాజరవుతున్నారు. అన్నాడీఎంకేకు తాను నాయకత్వం వహించాలని చాలా మంది కార్యకర్తలు కోరుకుంటున్నారని శశికళ ఇటీవల కామెంట్ చేశారు. వారి కోరిక మేరకు మళ్లీ అన్నాడీఎంకేకు నాయకత్వం వహిస్తానని, జయలలిత కలను నెరవేరుస్తానని ఆమె తెలిపారు. తనను కొంతమంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకునేందుకు ఓపీఎస్ సుముఖంగానే ఉన్నారని.. అయితే ఈపీఎస్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మరోవైపు శశికళను అన్నాడీఎంకేలో తిరిగి చేరేలా బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో నాగేంద్రన్.. శశికళ బీజేపీలో చేరాలనుకుంటే తాము స్వాగతిస్తామని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.