Asianet News TeluguAsianet News Telugu

దేశ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప్ర‌తిప‌క్షాలను ఏకం చేస్తాం.. కేసీఆర్ ఖమ్మం స‌భ‌పై నితీష్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు

Patna: ముఖ్యమంత్రి కేసీఆర్ ఖ‌మ్మం స‌భ దేశ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదే విష‌యంపై " ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశం నిర్వహించి ఇతరులను ఆహ్వానిస్తే వారు హాజరవుతారు. ఇది తన ర్యాలీ అని, ఆయన ఇతరులను ఆహ్వానించారని, నేను దీన్ని పెద్ద సమస్యగా చూడను, వారు చేసేది చేయనివ్వండి" అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. 
 

We will unite the opposition for the benefit of the country; Nitish Kumar's key comments on KCR's Khammam rally
Author
First Published Jan 20, 2023, 10:22 AM IST

Bihar Chief Minister Nitish Kumar: దేశ రాజ‌కీయాల్లో మ‌రోసారి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్వ‌హించిన ఖ‌మ్మం మెగా స‌భ క్రమంలో బీఆర్ఎస్ గురించి చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ర్యాలీకి అనేక మంది ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌ను ఆహ్వానించిన‌ప్ప‌టికీ.. ప‌లువురు హాజ‌రు కాలేదు. ఇదే స‌మ‌యంలో కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్, వామ‌ప‌క్ష నాయ‌కులు రాజా వంటి కీల‌క నేత‌లు హాజ‌ర‌య్యారు. అయితే, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేసేందుకు సాయం  కోరుతూ గతంలో కేసీఆర్ ప‌లువురు నేత‌ల‌ను క‌లిశారు. వారిలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఉన్నారు. అయితే, ఖ‌మ్మంలో జ‌రిగిన బీఆర్ఎస్ మెగా స‌భ‌కు ఆయ‌న హాజ‌రుకాక‌పోవ‌డం గురించి పొలిటిక‌ల్ గా హాట్ టాపిక్ గా మారింది. ఇదే విష‌యంపై నితీష్ కుమార్ తాజాగా స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

కేసీఆర్ స‌భ గురించి తెలియ‌దు.. 

ఖమ్మంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తలపెట్టిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ర్యాలీకి తనను ఆహ్వానించకపోవడంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మౌనం వీడారు.  " ఏ రాజకీయ పార్టీ అయినా సమావేశం నిర్వహించి ఇతరులను ఆహ్వానిస్తే వారు హాజరవుతారు. ఇది తన ర్యాలీ అని, ఆయన ఇతరులను ఆహ్వానించారని, నేను దీన్ని పెద్ద సమస్యగా చూడను, వారు చేసేది చేయనివ్వండి" అని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.  అలాగే, బీహార్ లో తమ ప్రభుత్వ పనుల్లో తాను ముందుగానే బిజీగా నిమగ్నమై ఉన్నాననీ, ఒకవేళ తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినా ర్యాలీకి హాజరయ్యేవాడిని కాదని అన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఐక్యతకు ముఖంగా నితీశ్ కుమార్ ను పార్టీ  జేడీయూ ప్రొజెక్ట్ చేస్తోందనే వార్తల నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ ప్రయోజ‌నాలు ముఖ్యం..

గత ఏడాది ఆగస్టులో ఎన్డీయే నుంచి వైదొలిగిన తర్వాత తిరిగి మహాకూటమిలోకి వచ్చి ఆర్జేడీ, కాంగ్రెస్ తో పాటు బీహార్ లోని వామపక్షాలు సహా మరో ఐదు రాజకీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రధాన ఫ్రంట్ ను ఏర్పాటు చేసేందుకు ఆయన ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలను సైతం కలిశారు. సీఎం కేసీఆర్ ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్ లో చేరే ప్రతిపాదనను అంగీకరిస్తారా అని గురువారం ఆయనను ప్రశ్నించగా.. 'నేను ఇప్పటికే అనేక రాజకీయ పార్టీలతో మాట్లాడానని మీకు తెలుసు. నేను ఇక్కడ నా పని పూర్తి చేసిన తర్వాత, ఈ సమస్యకు సంబంధించి ఏమి చేయాలో మేము చూస్తాము" అని అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్షాలను ఏకం చేసి ముందుకు సాగాలన్నదే తన ఉద్దేశమని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్, బీజేపీయేత‌ర కూట‌మి దిశ‌గా.. 

బుధవారం ఖమ్మంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ  స‌భ‌కు ఢిల్లీ ముఖ్య‌మంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, వామ‌ప‌క్ష నాయ‌కులు డి.రాజా, కేరళ ముఖ్య‌మంత్రి పినరయి విజయన్ వంటి ప్రముఖ నాయ‌కులు హాజరయ్యారు. ఇప్పుడు దేశంలో బీజేపీ, కాంగ్రెస్ కూటముల‌తో పాటు మ‌రో కొత్త‌కూట‌మి ఏర్పాటు కాబోతున్న‌ద‌నే సంకేత‌లు పంపిన‌ట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్ప‌టికే కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్ ల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. మ‌రో కూట‌మి ఏర్పాటు దిశ‌గా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలోనే ఆప్, ఎస్పీ, వామ‌ప‌క్ష పార్టీలు ఆయ‌న స‌భ‌కు రావ‌డం ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది.

మ‌రోవైపు బీజేపీయేతర పార్టీల్లో రాజకీయ అంటరానితనానికి తమ పార్టీ వ్యతిరేకమని పాట్నాలోని జేడీయూ నేతలు తెలిపారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కు చెందిన బీజేడీ, టీడీపీ తదితర భావసారూప్యత కలిగిన ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకే వేదికపైకి వచ్చి లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాన ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని నితీశ్ కుమార్ కోరుకుంటున్నారు. రాబోయే నెలల్లో నితీష్ కుమార్ ప్రధాన ప్రతిపక్ష నాయకులను కలుసుకుని బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Follow Us:
Download App:
  • android
  • ios