Aditya Thackeray: జమ్మూ & కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన వరుస హత్యలపై మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే వ్యాఖ్యానిస్తూ.. వారి కోసం మహారాష్ట్ర తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉన్నాయని అన్నారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు
Aditya Thackeray: కాశ్మీర్‌లో జరుగుతున్న వరుస హత్యలను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే తీవ్రంగా ఖండించారు. కాశ్మీరీ పండిట్ల అండగా ఉంటామనీ, వారి కోసం మహారాష్ట్ర తలుపులు తెరిచి ఉన్నాయని ఆదిత్య ఠాక్రే అన్నారు. జమ్మూ & కాశ్మీర్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, పునరావాసం కోరుకునే కాశ్మీరీ పండిట్‌ల కోసం మహారాష్ట్ర తలుపులు తెరిచి ఉన్నాయని అన్నారు. కాశ్మీర్‌లో గత పరిస్థితులు పునరావృతం కావడం దురదృష్టకరమనీ, భారత ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, భారతీయ జనతా పార్టీ (BJP)ని నిందించారు. కశ్మీరీ పండిట్‌ల కోసం కేంద్రం ఎటువంటి ప్రణాళికలు కలిగి లేదని ఆరోపించారు. వారికి భద్రత కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. 1990 నాటి పరిస్థితులు మళ్లీ పునారావృతమయ్యాయనీ, వారి భద్రత కోసం కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనీ, లోయలో హత్య జరిగినప్పుడల్లా.. హోంమంత్రి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయనీ.. సమావేశాలు ఏర్పాటు చేయడం కాదు.. చర్యలు తీసుకోవడం అవసరమని అన్నారు.
బీజేపీ అధికారంలోకి రావడం వల్ల కాశ్మీరీ పండిట్ల వలసలు జరుగుతాయని, గత 30 ఏళ్లలో కాశ్మీర్‌లో బీజేపీ రెండుసార్లు అధికారంలో ఉందనీ, రెండు సార్లు కాశ్మీరీ పండిట్‌లు వలస వెళ్లాల్సి వచ్చిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బిజెపి కేవలం ‘డర్టీ పాలిటిక్స్’ చేస్తోందని ఆయన ఆరోపించారు. బుద్గామ్‌లో రాహుల్ భట్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన తర్వాత నిరసన తెలుపుతున్న కాశ్మీరీ పండిట్‌లకు భద్రత కల్పించే బదులు బిజెపి ప్రభుత్వం నిరసనలపై విరుచుకుపడిందని కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో ప్రాణాంతకమైన కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశముందని, అయితే భయపడాల్సిన అవసరం లేదని ఆదిత్య ఠాక్రే అన్నారు. ఇప్పుడు ప్రజలు మళ్లీ మాస్క్‌లను ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజలు బయటకు వస్తే మాస్క్‌లను బాధ్యతాయుతంగా వాడాలని ఆదిత్య ఠాక్రే విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మళ్లీ మాస్క్‌లను తప్పనిసరి చేయాలనే ప్రశ్నపై ఆదిత్య థాకరే మాట్లాడుతూ.. “ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) మార్గదర్శకాలను జారీ చేసిన తరువాత కరోనా ప్రోటోకాల్‌ను అమలు చేస్తామని తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా తాజా స్థితి
మహారాష్ట్రలో నిన్న 1357 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో వరుసగా మూడో రోజు కూడా వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. శనివారం నమోదైన 1357 కేసుల్లో 889 కేసులు ఒక్క ముంబైలోనే నమోదు కావటం గమనార్హం. ఫిబ్రవరి 4న నగరంలో 846 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కేసులు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5888 మంది కోవిడ్-19 రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 78 లక్షల 91 వేల 703 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని, ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ 1 లక్ష 47 వేల 865 మంది రోగులు మరణించారని ఆరోగ్య శాఖ తెలిపింది. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 77 లక్షల 37 వేల 950 మంది కోలుకున్నారు.
