Parliament Budget Session 2023: అధికార బీజేపీ - ప్రతిపక్షాల మాటల యుద్ధం మధ్య రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నియంతృత్వ పాలనగా అభివర్ణించాయి.
Congress president Mallikarjun Kharge: నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడుల వంటి అంశాలను బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. బీజేపీ, ప్రతిపక్షాల విమర్శలు, ఆరోపణల మాటల యుద్ధం మధ్య రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లండన్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడగా, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నియంతృత్వ పాలనగా అభివర్ణించాయి.
సభ ప్రారంభానికి ముందు మల్లికార్జున ఖర్గే ఏఎన్ఐతో మాట్లాడుతూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఈడీ-సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు సహా ప్రతి అంశాన్ని ప్రతిపక్ష నేతలు లేవనెత్తుతారని చెప్పారు. ఒక వ్యూహాన్ని రూపొందించడానికి మేము ప్రతిపక్ష నాయకులందరి అభిప్రాయాలను తీసుకుంటామని కూడా ఆయన పేర్కొన్నారు. "సీనియర్ సిటిజన్ అయిన లాలూ ప్రసాద్ యాదవ్, గర్భవతి అయిన ఆయన కోడలు పట్ల ఏమాత్రం సానుభూతి చూపకుండా ప్రభుత్వ సంస్థలు ప్రతిపక్ష నేతలను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఏజెన్సీలు తమ విధులను నిర్వర్తించడానికి స్వేచ్ఛగా ఉంటాయి, కానీ కక్షసాధింపు కోసం, రాజకీయ ప్రభావానికి గురికావడం తప్పు" అని ఖర్గే అన్నారు.
అలాగే, కర్ణాటక ప్రజల నుంచి బీజేపీ సానుభూతి పొందుతోందని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలోనే ఇలా ప్రవర్తిస్తోందంటూ విమర్శించారు. ప్రధాని మోడీ వరుస పర్యటనలు అందుకే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. "ప్రధాని మోడీ కర్ణాటక ప్రజల నుంచి సానుభూతి పొందడంలో బిజీగా ఉన్నారు. మేము వారి పని గురించి అడుగుతున్నాము, వారు కర్ణాటక ప్రజలకు ఏమి ఇచ్చారు. రోడ్డుకు రెండు చివరలను అనుసంధానం చేయడం ద్వారా మొత్తం క్రెడిట్ తీసుకోవాలని వారు భావిస్తున్నారు. పర్యాటకుల కోసం మైసూరును కలిపేందుకు రోడ్డు నిర్మించాం. అబద్దాలు మాట్లాడకుండా నిజాలు చెప్పాలని" అన్నారు.
ఇదిలావుండగా, ఖర్గే ఈ ఉదయం పార్లమెంటులోని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ సోనియాగాంధీ, అధిర్ రంజన్ చౌధురితో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలకు వ్యూహరచన కోసం 16 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని ఖర్గే కార్యాలయంలో సమావేశమయ్యాయి. నెల రోజుల విరామం తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తిరిగి సోమవారం ప్రారంభమయ్యాయి. శాఖ సంబంధిత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు గ్రాంట్ల డిమాండ్లను పరిశీలించి, తమ మంత్రిత్వ శాఖలు లేదా విభాగాలకు సంబంధించిన నివేదికలు రూపొందించడానికి వీలు కల్పించడం కోసం ఇదివరకు సమావేశాలకు విరామం ఇచ్చారు.
మార్చి 13న ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా గ్రాంట్ల డిమాండ్ పై చర్చించి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ను ఆమోదించనున్నారు.
