Bihar Politics: బీహార్ లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం త‌న‌ 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తమ పార్టీ నెరవేరుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇటీవల చెప్పారు.  

Prashant Kishor: ఎన్నిక‌ల వ్యూహకర్త, రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ బుధ‌వారం నాడు బీహార్ రాజ‌కీయాల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కొత్త ప్రభుత్వం రెండేళ్లలో 5-10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే బీహార్‌లో ప్రచారాన్ని విరమించుకుంటామ‌ని ఆయ‌న అన్నారు. దీంతో మ‌రోసారి రాష్ట్ర రాజ‌కీయాల్లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యానికి కీల‌క మార్పులు చోటుచేసుకుంటాయ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. 

వివ‌రాల్లోకెళ్తే.. బీహార్‌లో కొత్తగా ఏర్పడిన 'మహాఘటబంధన్' ప్రభుత్వం వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ఐదు నుంచి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే, తాను తన 'జన్ సూరజ్ అభియాన్'ను ఉపసంహరించుకుంటానని, ముఖ్య‌మంత్రి, జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ పాలనకు మద్దతు ఇస్తానని ఎన్నిక‌ల వ్యూహకర్త, రాజకీయ నాయ‌కులు ప్ర‌శాంత్ కిషోర్ అన్నారు. బుధవారం నాడు సమస్తిపూర్‌లో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్ర‌శాంత్ కిషోర్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఒకప్పుడు నితీష్ కుమార్‌కు నమ్మకస్తుడైన ఆయ‌న ఆర్జేడీ-జేడీ(యూ)-కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదని పేర్కొన్నారు. "నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి కట్టుబడి ఉండటానికి 'ఫెవికాల్' (అంటిపెట్టుకునే బ్రాండ్) ఉపయోగిస్తాడు.. ఇతర పార్టీలు దాని చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి" అని ఆయన అన్నారు.

కొత్త ప్రభుత్వం ఏర్పాటు త‌ర్వాత‌.. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీని తమ పార్టీ నెరవేరుస్తుందని ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇటీవల చెప్పారు. అలాగే, గాంధీ మైదాన్‌లో స్వాతంత్య్ర‌ దినోత్సవ సంద‌ర్భంగా నితీష్ కుమార్ ప్ర‌సంగిస్తూ.."రాష్ట్రంలో ప్రభుత్వ, ప్ర‌యివేటు రంగాలలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. కొత్త తరం (తేజస్వి యాదవ్) ప్రజలు మాతో ఉన్నారు. అందుకే, ఉద్యోగాలు కల్పించేందుకు ఉమ్మడిగా కృషి చేస్తాం. అభివృద్ధి చెందిన రాష్ట్రాల కేటగిరీలో బీహార్‌ను చేర్చడమే మా లక్ష్యం" అని అన్నారు. మహాకూటమి ప్రభుత్వం చేసిన వాగ్దానాలపై ప్ర‌శాంత్ కిషోర్ స్పందిస్తూ, “నేను నా ‘జన్ సూరజ్ అభియాన్’ని ఉపసంహరించుకుంటాను.. వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ఐదు నుండి 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే నితీష్ కుమార్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు రాష్ట్ర రాజకీయ పరిణామాల్లో మరిన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయి" అంటూ ఆయన జోస్యం చెప్పారు.

"నేను బీహార్‌లో రాజకీయ రంగ ప్రవేశం చేసి కేవలం మూడు నెలలు మాత్రమే అయింది. రాష్ట్ర రాజకీయాలు 180 డిగ్రీల మలుపు తీసుకున్నాయి. రానున్న కాలంలో రాష్ట్రంలో మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోనున్నాయి" అని అన్నారు. కాగా, గతంలో JD(U)లో భాగమైన ప్రశాంత్ కిషోర్, ప్రాంతీయ సంబంధాలను నెలకొల్పడానికి, బీహార్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి.. వాటికి సాధ్యమైన పరిష్కారాలను అందించడానికి 'జన్ సూరజ్ అభియాన్'ను ప్రారంభిస్తానని ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించారు. కాగా, నితీష్ కుమార్ ఇటీవల బీజేపీ సారథ్యంలోని ఏన్డీయే కూటమికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఆర్జేడీ సహా మహా కూటమి పార్టీలతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.