కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతాం.. తర్వాత ఆర్థిక గణన కూడా.. - రాహుల్ గాంధీ
తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుల గణన నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమిలోని పార్టీలు కూడా ఈ విషయంలో తమకు మద్దతు ఇస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడుతామని ఆ పార్టీ నాయకుడు, లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నేడు ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఇందులో చర్చించిన పలు అంశాలను రాహుల్ గాంధీ మీడియాకు వెల్లడించారు. ‘‘దేశంలో కుల గణన ఆలోచనకు సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా మద్దతు తెలిపింది. ‘ఇది ప్రగతిశీల చర్య. మన ముఖ్యమంత్రులు (ఛత్తీస్ గఢ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్) కూడా దీన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు’ అని తెలిపారు.
కుల గణన నిర్వహించాలని బీజేపీపై ఒత్తిడి తెస్తామని, ఎందుకంటే ఇది దేశానికి అవసరమని రాహుల్ గాంధీ అన్నారు. ఇండియా కూటమిలోని చాలా పార్టీలు మద్దతు ఇస్తాయని తాను భావిస్తున్నానని అన్నారు. కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వకపోవచ్చనీ, కానీ దానిపై తమకు ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పేద ప్రజల విముక్తి కోసం ఇది ప్రగతిశీల, శక్తివంతమైన అడుగు అని చెప్పారు.
‘‘ఇది కులం, మతం గురించి కాదు. పేదరికానికి సంబంధించినది. కుల గణన పేదల కోసమే. నేడు మనకు రెండు భారతదేశాలు ఉన్నాయి. కుల గణనతో ఆగబోం. ఆ తర్వాత ఆర్థిక సర్వే ఉంటుంది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతానికైతే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కుల గణన నిర్వహిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. కుల గణన అనేది రాజకీయ నిర్ణయం కాదని, న్యాయం ఆధారంగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు. కోవిడ్ -19, చైనా గురించి తాను చెప్పినట్టుగానే.. దేశంలో కుల గణన జరుగుతుందని తాను మళ్లీ చెబుతున్నానని అన్నారు. దీనిని కచ్చితంగా కాంగ్రెస్ చేస్తుందని హామీ ఇచ్చారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో కొత్త నమూన, అభివృద్ధి కోసం ఈ కుల గణన అవసరమే అని అన్నారు. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబీసీ) జనాభాకు అనుగుణంగా సామాజిక న్యాయం, హక్కులను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా కుల గణనను నిర్వహించాల్సిందే అని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల్లో సరైన భాగస్వామ్యం కావాలంటే బడుగు బలహీన వర్గాల స్థితిగతులపై సామాజిక, ఆర్థిక గణాంకాలు ఉండాలని, వారికి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని తెలిపారు.