యూపీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత మొదటి సారిగా సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీని ఓడించలేకపోయినా.. ఆ పార్టీ స్థానాలను మాత్రం తగ్గించగలిగామని అన్నారు. తమ పార్టీకి ఓటు వేసిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పారు.
యూపీ (UP) లో బీజేపీ (BJP) మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. యూపీ సీఎం కుర్చీపై మరో సారి యోగి ఆదిత్యనాథ్ (Yogi adityanath) కూర్చోనున్నారు. వరుసగా రెండో సారి యూపీలో కషాయ జెండా ఎగరనుంది. గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించిన ఫలితాల్లో బీజేపీ దాని మిత్ర పక్షాలు కలిసి 273 స్థానాలు గెలుచుకున్నాయి.
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన ఒకరోజు తరువాత సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. ఓటర్లు తమకు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదలు తెలిపారు. తాము ఈ ఎన్నికల్లో బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించగలిగామని చెప్పారు. రాష్ట్ర ఓటర్లు తమ సీట్ల సంఖ్యను రెండున్నర రేట్లు పెంచారని, ఓట్ల వాటాలో ఒకటిన్నర రేట్లు అధికంగా అందించారని తెలిపారు. ట్విట్వర్ వేదికగా ఓటర్లందరికీ థ్యాంక్స్ చెప్పారు.
‘‘ బీజేపీ సీట్ల సంఖ్యను తగ్గించవచ్చని మేము నిరూపించాం. ఈ క్షీణత ఇంకా కొనసాగుతుంది. సగానికి పైగా అబద్ధాలు తుడిచివేయబడ్డాయి. ప్రజా ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగుతుంది ’’ అని ఆయన ఫలితాలు వెలువడిన తరువాత మొదటి సారి బహిరంగంగా ప్రకటించారు.
యూపీలో అసెంబ్లీ మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి మొత్తం 273 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే 2017లో సమాజ్ వాదీ పార్టీ గద్దె దించేసమయానికి బీజేపీ ప్రస్తుతం కంటే 49 స్థానాలు ఎక్కువగా సాధించింది. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ సొంతంగా 111 సీట్లు గెలుచుకోగా, దాని నేతృత్వంలోని కూటమి 125 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 2017 ఎన్నికలతో చూస్తే ప్రస్తుతం 73 స్థానాలు పెరిగాయి. ప్రస్తుత ఎన్నికల్లో ఓట్ల శాతం విషయానికొస్తే, బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా, సమాజ్‌వాదీ పార్టీ 32 శాతం ఓట్లను పొందగలిగింది.
ఈ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు అఖిలేష్ యాదవ్ ఓటర్లను ఆకర్శించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. రాష్ట్రం మొత్తం విస్తృతంగా పర్యటించారు. 2017 ఎన్నికల సమయంలో చేసిన తప్పులను మళ్లీ చేయలేదు. ఈ ఎన్నికల్లో బీఎస్పీతో, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకుండానే బరిలోకి దిగారు. ఆర్ఎల్డీ కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్ కూడా ఒంటరిగానే పోటీ చేసింది. అయితే బీఎస్పీ కూడా ఒంటరిగానే పోటీ నిలిచినప్పటికీ అంతర్గతంగా బీజేపీకి మద్దతు తెలిపిందనే ఆరోపణలు వినిపించాయి.
ఈ ఎన్నికల ఫలితాలను గమనిస్తే బీఎస్పీ (bsp), కాంగ్రెస్ (congress) ఘోరంగా చతికిలపడ్డాయి. కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీ ఉత్తరప్రదేశ్ లో కేవలం 2 స్థానాలకే పరిమితం అయ్యింది. బీఎస్పీ కూడా ఒక స్థానాన్నే గెలుచుకుంది. దీంతో ఆ రెండు పార్టీలకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బలంగా తన వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజారిపోయింది. అక్కడ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal) నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (aam admi party) ఘన విజయం సాధించింది. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 92 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది.
