Asianet News TeluguAsianet News Telugu

ఇది వేవ్ కాదు.. సునామీ : కరోనా విజృంభణపై ఢిల్లీ హైకోర్టు..

కరోనా సెకండ్ వేవ్.. వేవ్ కాదని అది కరోనా సునామి అని ఢిల్లీ హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. మే మధ్యనాటికి కేసుల పెరుగుదల భయంకరమైన తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోబోతోందని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

We re Calling It A Wave, It Is A Tsunami : Delhi High Court On COVID-19 Crisis - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 5:07 PM IST

కరోనా సెకండ్ వేవ్.. వేవ్ కాదని అది కరోనా సునామి అని ఢిల్లీ హైకోర్టు సంచలన కామెంట్స్ చేసింది. మే మధ్యనాటికి కేసుల పెరుగుదల భయంకరమైన తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో దాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోబోతోందని కేంద్రాన్ని ప్రశ్నించింది. 

ఇదే సమయంలో ఆక్సీజన్ రవాణాను అడ్డుకున్న వారికి ఉరిశిక్ష వేస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని అనేక ఆసుపత్రుల్లో ఆక్సీజన్ కొరతతో అనేకమంది రోగులు మృత్యవాత పడుతున్న సంగతి తెలిసిందే. 

ఢిల్లీలోని ఆక్సిజన్ సంక్షోభంపై సెలవు దినంనాడు జస్టిస్ విపిన్ సంఘి, రేఖ పల్లిలతో కూడిన ధర్మాసనం చేపట్టిన ప్రత్యేక విచారణలో ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. 

వైరస్ వల్ల మరణాలు తక్కువగానే ఉన్నాయని.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా చనిపోతున్నారని.. అయితే బతకగలిగే రోగులే చనిపోతుండడమే అసలు సమస్య అని.. మరణాల రేటును బాగా తగ్గించాల్సిన అవసరం ఉంది అని కోర్టు పేర్కొంది.

ఆక్సిజన్ ట్యాంకర్‌ను ఆపితే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు సంచలన ఆదేశాలు...

కాన్పూర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) శాస్త్రవేత్తల బృందం జరిపిన అధ్యయనాన్ని ప్రస్తావిస్తూ, ఈ కోవిడ్ వేవ్ తీవ్రరూపం మే మధ్యలో ఉంటుందని కోర్టు అంచనా వేసింది.

"మనం దీన్ని వేవ్ అంటున్నాం.. కానీ నిజానికి ఇది సునామీ" అని కోర్టు పేర్కొంది. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎలాంటి మౌలిక సదుపాయాలు, ఆస్పత్రులు, వైద్య సిబ్బంది, మందులు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ పరంగా సంసిద్ధత ఏర్పాటు చేయబోతున్నారు అని  కేంద్రాన్ని ప్రశ్నించింది. 

మే, జూన్ నెలల్లో కేసుల సంఖ్య వేగంగా పెరిగే అవకాశం ఉంది, దేశం అత్యంత వరస్ట్ పరిస్థితులకు సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు.

ప్రధాని, ఇతరులు దీనిపై కృషి చేస్తున్నారని, ఆక్సిజన్‌ను దిగుమతికి నిర్ణయం తీసుకున్నారని, సాధ్యమైన అన్ని చోట్లనుంచీ ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అవకాశాల్ని కూడా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు.

తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న కోవిడ్ రోగులకు చికిత్స చేయడానికి ఆక్సిజన్ కొరతపై మహారాజా అగ్రసేన్ హాస్పిటల్, జైపూర్ గోల్డెన్ హాస్పిటల్, బాత్రా హాస్పిటల్, సరోజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ల తరపు న్యాయవాది సమర్పించిన పిటిషన్లను న్యాయస్థానం విన్నది.

ఢిల్లీ ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సీజన్ కొరత.. జైపూర్ గోల్డెన్ హాస్పిటల్ లో 20 మంది రోగులు మృతి... !..

ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్ర, రాష్ట్ర లేదా స్థానిక పరిపాలనలో ఏ అధికారి అయినా ఆక్సిజన్ సరఫరాను అడ్డుకోవడాన్ని ప్రయత్నిస్తే "మేము ఆ వ్యక్తిని ఉరితీస్తాము, మేము ఎవరినీ విడిచిపెట్టము" అని కోర్టు చెప్పింది. 

స్థానిక అధికారులెవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేయాలని వారిమీద వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపింది. అంతేకాదు ఢిల్లీకి కేంద్రం రోజుకు కేటాయించిన 480 మెట్రిక్ టన్నుల (ఎమ్‌టి) ఆక్సిజన్ ఎప్పుడు వస్తుందో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. 

"కేంద్రం మాకు ఏప్రిల్ 21 న 480 మెట్రిక్ టన్నులు ఆక్సీజన్ ఢిల్లీకి చేరుకుంటుందని హామీ ఇచ్చింది. అది ఎప్పుడు వస్తుందో చెప్పండి? రోజుకు 480 మెట్రిక్ టన్నులు ఇంకా అందడం లేదు."

గత కొద్ది రోజులుగా రోజుకు 380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే లభిస్తోందని, శుక్రవారం 300 మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చిందని ఢిల్లీ ప్రభుత్వం చెప్పడంతో కోర్టు ఈ ప్రశ్న వేసింది.

విచారణ సందర్భంగా, ఢిల్లీ ప్రభుత్వ అధికారులను కేంద్రం కేటాయించిన ఆక్సిజన్ ను తీసుకురావడానికి, భద్రపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పమని కోర్టు ప్రశ్నించింది.

Follow Us:
Download App:
  • android
  • ios