నీట్ పీజీకి జీరో క్వాలిఫైయింగ్ పర్సంటైల్.. కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు
నీట్ వల్ల ప్రయోజనం శూన్యమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అది నిజమని అంగీకరించిందని తెలిపారు నీట్ కేవలం కోచింగ్ సెంటర్లు, పరీక్షకు ఫీజులు కట్టేందుకే ఉపయోగపడుతోందని అన్నారు.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పీజీ కటాఫ్ ను సున్నాకు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం మండిపడ్డారు. జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష లో ‘అర్హత’ అనేది అర్థరహితం అని వారు (కేంద్రం) అంగీకరిస్తున్నారని అన్నారు. ‘‘నీట్ వల్ల ప్రయోజనం శూన్యమని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. నీట్ పీజీ కటాఫ్ ను 'జీరో'కు కుదించడం ద్వారా నేషనల్ 'ఎలిజిబిలిటీ' కమ్ ఎంట్రన్స్ టెస్ట్ లో 'అర్హత' అర్థరహితమని అంగీకరిస్తున్నారు. కేవలం కోచింగ్ సెంటర్లు, పరీక్షకు డబ్బులు చెల్లించడం మాత్రమే. అంతకుమించి క్వాలిఫికేషన్ అవసరం లేదు’’ అని ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
‘‘నీట్ = 0. నీట్ కు మెరిట్ తో సంబంధం లేదని, దీన్ని మేం ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నాం. అసలు అర్హతా ప్రమాణాలు లేకుండా ఇది కేవలం లాంఛనప్రాయంగా మారింది’’ అని ఆయన విమర్శించారు. ఈ పరీక్ష కారణంగా జరిగిన ప్రాణనష్టం గురించి సీఎం ఆ పోస్ట్ లో ఆవేదన వ్యక్తం చేస్తూ, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘అనేక మంది విలువైన ప్రాణాలు కోల్పోయినప్పటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం హృదయం లేకుండా ప్రవర్తించింది. ఇప్పుడు ఇలాంటి ఉత్తర్వును తీసుకువచ్చింది. నీట్ అనే నినాదంతో ప్రాణనష్టం కలిగించినందుకు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి’’ అని అన్నారు.
కాగా.. నీట్-పీజీ 2023 అర్హత శాతాన్ని తగ్గించేందుకు వైద్య విద్యావిధానంలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బుధవారం జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కు నోటీసులు జారీ చేసింది. నీట్-పీజీ 2023 కటాఫ్ ప్రమాణాలను తగ్గించాలని దేశవ్యాప్తంగా వైద్యులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉండగా.. నీట్ పీజీ కటాఫ్ ప్రమాణాలకు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటీసుపై ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) అసహనం వ్యక్తం చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లకు జీరో పర్సంటైల్ అభ్యర్థులు అర్హులు కావడం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని పేర్కొంది. ‘‘ నీట్ పీజీ కటాఫ్ కు సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇలాంటి నోటీసును చూసి షాక్ కు గురయ్యాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటు పొందడానికి జీరో పర్సంటైల్ అభ్యర్థులు అర్హులు కావడం హాస్యాస్పదంగా ఉంది. ఇది వైద్య విద్య, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రమాణాలను అపహాస్యం చేయడమే’’ అని ఫైమా డాక్టర్స్ అసోసియేషన్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.