కర్నాటక సీనియర్ మంత్రి కెఎస్ ఈశ్వరప్ప సోమవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న వేలాది పేద కుటుంబాలకు పరిహారంగా డబ్బులు పంచిపెట్టడానికి ప్రభుత్వం దగ్గర నోట్లు ప్రింట్ చేసే మిషనేం లేదు.. అంటూ వివాదానికి తెరతీశారు.  

ప్రతీ కుటుంబానికి పదివేల రూపాయలు నష్టపరిహారంగా ఇవ్వడానికి మేమేమైనా నోట్లు ప్రింట్ చేస్తున్నామా? అంటూ విరుచుకుపడ్డారు. పేద కుటుంబాలకు పదివేలరూపాయల నష్టపరిహారం ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్లకు ఆయన తన స్వస్థలమైన శివమొగ్గలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. 

బీజేపీ పాలిత రాష్ట్రంలో లాక్డౌన్ వల్ల ప్రజల దుస్థితి మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రెండో మంత్రి ఈశ్వరప్ప. ఏప్రిల్ 28 న, రాష్ట్ర ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేష్ వి కట్టి ‘రైతులు చనిపోవడానికి ఇది మంచి సమయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

ఓ రైతు ఉద్యమకారుడు రైతులకు ఆహార ధాన్యాల కేటాయింపు గురించి మంత్రితో ఫోన్ లో ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఈ మేరకు ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారింది. 

లాక్డౌన్ పరిస్తితులను ప్రభుత్వం హ్యాండిల్ చేస్తున్న తీరుమీద ప్రతిపక్షాలు విరుచుకుపడడాన్ని గురించి మాట్లాడుతూ ఈశ్వరప్ప.. ‘కొద్ది రోజులు వాళ్లు నోరు మూసుకుని ఉంటే లాక్డౌన్ విజయవంతమవుతుంది’ అన్నారు. మాజీ ముఖ్యమంతి హెచ్ డి కుమారస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ లను ఉద్దేశించి ‘14 రోజులపాటు కాస్త నోర్లు మూసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు’ అంటూ కామెంట్స్ చేశారు. 

ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదు. వందేళ్ల తరువాత ఇలాంటి మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎవ్వరూ దీన్నిముందుగా ఊహించలేదు అని చెప్పుకొచ్చారు. 

ఈశ్వరప్ప వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారాన్ని లేపాయి.. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిమీద స్పందిస్తూ ‘అధిక నోట్లు ముద్రిస్తారో, రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తారో ఈశ్వరప్ప ఇష్టం. కానీ అధికార పార్టీ మంత్రిగా పేద ప్రజల్ని ఆదుకోవాల్సిన భాద్యత ఆయనది’ అన్నారు. 

బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఆర్థికసాయం చేయమని అడుగుతున్నాయి. అయితే ఈ వ్యాఖ్యలు ప్రభుత్వం సాయం చేసే స్తితిలో ఉందో లేదో చెప్పే పరిస్తితి లేదు. దీనిమీద ప్రభుత్వం ఆలోచిస్తోంది. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటుంది అన్నారు.