ఓ హిందూ యువతి.. ముస్లిం యువకుడిని ప్రేమించింది. అతనినే పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడింది. తాను ఆశపడినట్లు అతనినే పెళ్లి కూడా చేసుకుంది. అయితే..పెళ్లికి ముందు ఆమె మతం మార్పిడి చేసుకుంది. తమ కూతురు అలా మతం మార్చుకోవడం యువతి తల్లిదండ్రులకు నచ్చలేదు. దీంతో.. కోర్టును ఆశ్రయించారు. కాగా.. ఈ వ్యవహారంపై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వారి పెళ్లి చెల్లుబాటు అవుతుందని.. చట్టబద్ధమేనని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా  ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రియాంక కర్వార్ అనే యువతి సలామత్ అన్సారీ అనే యువకుడిని గతేడాది ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లికి ముందు ప్రియాంక మత మార్పిడి చేసుకున్నారు. తన పేరును  ఆలియాగా మార్చుకున్నారు. అయితే వీరిద్దరి వివాహంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యువతి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. 

తమ కుమార్తెను బలవంతంగా మతమార్పిడి చేయించి, ముస్లిం మతంలోకి మార్చి వివాహం చేసుకున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. మైనరైన తమ కుమార్తెను మోసగించి చేసుకున్న వివాహాన్ని రద్దు చేయాలని కోరారు. అంతేకాకుండా వరుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.  దీనిపై సుమారు ఏడాది పాటు విచారణ జరిపిన వివేక్‌ అగర్వాల్‌, పంకజ్‌ నఖ్వీల ద్విసభ్య ధర్మాసనం మంగళవారం  తుది తీర్పును వెలువరించింది.

‘యువతీ, యువకులను తాము మత ప్రతిపాదకన చూడటంలేదు.  ప్రియాంక హిందు, అన్సారీ ముస్లిం అయినప్పటికీ వారి వివాహాన్ని మత కోణంలో విభజించలేం. కులం, మతం, వర్గంతో సంబంధంలేకుండా ఇష్టమైన భాగస్వామిని ఎంచుకునే హక్కు పౌరులకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించింది. యువతి తన ఇష్టపూర్వకంగానే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నా అని చెబుతోంది. దీనిలో ఎలాంటి బలవంతం లేదని కోర్టు విశ్వసిస్తోంది. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదు. వివాహం సమయంలో యువతి వయసు 20 ఏళ్లు. తన విచక్షణ మేరకే మతమార్పిడి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. వీరి వివాహాన్ని కోర్టు అంగీకరిస్తోంది’ అంటూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. యువతి తల్లీదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.