ఏడు దశల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి చేపట్టిన ఎన్నికలు సోమవారంతో ముగిశాయి. ఈ సారి ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ చివరి స్థానంలో నిలుస్తుందని దాదాపుగా అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. తాము చేయాల్సిందంతా చేశామని, తీవ్రంగా పోరాడామని తెలిపారు. ఫలితాలు వచ్చేంత వరకు ఎదురు చూస్తామని చెప్పారు.
లక్నో : యూపీ (Up)లో అసెంబ్లీ ఎన్నికలు నిన్నటితో ముగిశాయి. దీంతో దాదాపు రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దాదాపు ఏడు విడతలుగా చేపట్టిన ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు యూపీలో ఎవరు గెలుస్తారనే విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే సోమవారం సాయంత్రం పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ (exit polls) ఫలితాలు విడుదల అయ్యాయి.
ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ(bjp)యే మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉందని తెలిపాయి. బీజేపీ మొదటి స్థానంలో, సమాజ్ వాదీ పార్టీ (samajwadi party) రెండో స్థానంలో, బీఎస్పీ (bsp) మూడో స్థానంలో, కాంగ్రెస్ (congress) నాలుగో స్థానంలో నిలుస్తాయని చెప్పాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ (exit polls)పై మంగళవారం ప్రియాంక గాంధీ (priyanaka gandi) స్పందించారు. ఉత్తరప్రదేశ్ (uttar pradesh) ఎన్నికల పోరులో తమ పార్టీ గట్టిగా పోరాడిందని తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘లడ్కీ హూన్, లడ్ శక్తి హూన్’ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘ ఈరోజు మన పార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడిన 159 మంది మహిళా అభ్యర్థుతో లక్నో (lacknow)లో జరుపుకుంటున్న సెలబ్రేషన్ ఇది. వారందరూ ఎన్నికల్లో పోరాడారు. వారితోనే ఈ ఇంటర్నేషనల్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం.’’ అని తెలిపారు.
తాము ఎన్నికల్లో వీలైనంత గట్టిగా పోరాడామని ఆమె తెలిపారు. ఫలితాల కోసం వేచి ఉంటామని ప్రియాంక గాంధీ చెప్పారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో 403 స్థానాలు ఉన్నాయి. యూపీలో అధికారం చేపట్టాలంటే దాదాపు 202 స్థానాలు అవసరం ఉంటుంది. అయితే బీజేపీ దాని మిత్రపక్షాలతో కలిపి ఈ మెజారిటీ సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. News18-P MARQ ఎగ్జిట్ పోల్ ప్రకారం BJP దాని మిత్రపక్షాలకు 240 సీట్లు, సమాజ్‌వాదీ దాని మిత్రపక్షాలకు 140 సీట్లు, BSP 17 సీట్లు, కాంగ్రెస్‌కు 4 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
NewsX-Polstrat ఎగ్జిట్ పోల్ ప్రకారం BJP 211-225 సీట్లు, SP-RLD కూటమి 146-160 సీట్లు, BSP 14-24 సీట్లు, కాంగ్రెస్ నాలుగు నుండి 6 సీట్లు గెలుచుకుంటాయని తెలిపాయి. టైమ్స్ నౌ-వీటో ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 225 సీట్లు, ఎస్పీ-ఆర్‌ఎల్‌డీకి 151 సీట్లు, బీఎస్పీకి 14, కాంగ్రెస్‌కు 9 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇండియా న్యూస్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 222-260 సీట్లు, ఎస్పీ 135-165 సీట్లు, బీఎస్పీ 4 నుంచి 9 సీట్లు, కాంగ్రెస్ ఒకటి నుంచి మూడు సీట్లు గెలుచుకోవచ్చు.
దీంతో పాటు టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి 294 సీట్లు, ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమికి 105 స్థానాలు, బీఎస్పీకి రెండు సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్‌కు ఒక సీటు, ఇతరులకు ఒక సీటు దక్కే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. అన్ని సర్వేలు కాంగ్రెస్ చివరి స్థానంలో నిలుస్తాయని చెప్పాయి. ప్రస్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉండగా.. సమాజ్ వాదీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది.
