మేం దౌత్యాన్ని ఏసీ గదుల నుంచి ప్రజల చెంతకు తీసుకెళ్లాం: కేంద్రమంత్రి జైశంకర్
జీ 20 సదస్సులో దౌత్యంలోనే సంస్కరణలు తీసుకువచ్చే ప్రయత్నం చేశామని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. దౌత్యాన్ని ఏసీ గదుల నుంచి ప్రజల చెంతకు తీసుకెళ్లామని చెప్పారు.

న్యూఢిల్లీ: మన దేశం ఇటీవలే జీ 20 శిఖరాగ్ర సమావేశాలను దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచమంతా ఈ సదస్సు నిర్వహణ తీరును ప్రశంసించాయి. తాజాగా, జీ 20 సమావేశానికి సంబంధించి కీలక విషయాలను కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ ఏషియానెట్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ప్రపంచ దేశాల మధ్య శాంతి భద్రతలు ఉండేలా, పరస్పరం సహాయకాలుగా మెలగాలనే లక్ష్యాలనే ఐక్యరాజ్య సమితి కలిగి ఉన్నది. అయితే, అది ఏర్పడిన కాలానికి ఇప్పటి కాలానికి మధ్య గణనీయమైన మార్పులు వచ్చాయని, అది దాని ప్రాసంగికతను కోల్పోకముందే సంస్కరించుకోవాలని భారత్ పిలుపు ఇచ్చింది. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరం అని జీ 20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి కొన్ని దేశాల ప్రభుత్వ పెద్దలు కలిసి చర్చించుకునే సమావేశాల్లో ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు ప్రాధాన్యత ఉన్నది.
జీ20 సదస్సులో భారత్ చేసిన కృషిని చూస్తే మల్టిలేటరిజం(కొన్ని దేశాల ప్రభుత్వాలు ఒకే వేదిక మీదకి వచ్చే విధానం!)లోనే సంస్కరణలు రావాలనే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తున్నదని కేంద్రమంత్రి ఎస్ జైశంకర్‌తో ఏషియానెట్ న్యూస్ ఆరా తీసింది. ఒక రకంగా ఇది ఐరాస తీరులోనే మార్పులకు ఇది దోహదం చేయవచ్చునా? అని అడిగింది.
Also Read: Mumbai Local Train: కదులుతున్న ట్రైన్‌లోకి నెట్టుకుంటూ మహిళలు.. వైరల్ వీడియోపై రచ్చ
తాను ఈ ప్రయత్నాలను మల్టిటలేటరిజంలో సంస్కరణలుగా చూడబోనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. తాను అంతకు మించి చూస్తానని, దౌత్యంలో సంస్కరణగా చూస్తానని వివరించారు. దౌత్యాన్ని ఏసీ గదులు, కన్వెన్షన్‌లు, హోటల్ రూమ్‌లు, ఎయిర్‌పోర్టుల నుంచి ప్రజల మధ్యకు తీసుకెళ్లడంగా తాను చూస్తానని వివరించారు. దౌత్యాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినట్టుగా తాను చూస్తానని తెలిపారు. సుమారు 200కు పైగా సమావేశాలను 60 నగరాల్లో నిర్వహించడం దౌత్యాన్ని వారి నిజ జీవితాల్లోకి తీసుకెళ్లినట్టేనని చెప్పారు.
భారత్ ఇటీవలే విదేశాంగ విధానానికి సంబంధించి బలమైన వైఖరిని అవలంభిస్తున్నదని కేంద్రమంత్రి తెలిపారు. విదేశాంగ విధానానికి మన దేశం ఒక ఏడాది కాలంగా మన దేశం తనను తాను అన్వయించుకున్న విధానం గతంలో ఎన్నడూ చూడలేనిదని అన్నారు.