దేశంలో ముస్లిం జనాభాపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన విరమించుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ముస్లింల జనాభా పెరగడం లేదని, ముస్లింలు ఎక్కువగా కండోమ్‌లు వాడుతున్నారని, మోహన్ భగవత్ లెక్కలు ముందు పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.  

దేశంలో జనాభా నియంత్రణ, మత అసమతుల్యతపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ చేసిన ప్రకటనపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఒవైసీ ప్రసంగిస్తూ.. భగవత్ జీ..! జ‌నాభా పెరుగుద‌ల‌పై భయాందోళన చెందవద్దని, ముస్లిం జనాభా ఏమాత్రం పెరగడం లేదని, రోజురోజుకు త‌గ్గుతోంద‌ని సూచించారు. ఎందుకంటే చాలా మంది ముస్లింలు కండోమ్‌లను ఉపయోగిస్తున్నారని, ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం కూడా ముస్లింలలో అత్యధికమ‌నీ, ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు కూడా వేగంగా తగ్గుతోందని గణాంకాలను ప‌రిశీలించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. 

సంఘ్ చీఫ్ ప్రకటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో మతపరమైన అసమతుల్యత ఉందని, జనాభా పెరుగుద‌ల‌పై ఆలోచించాలని మోహన్ భగవత్ అంటున్నారనీ, కానీ.. ముస్లింల మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) రెండు శాతమేన‌నీ, దేశంలో క్ర‌మంగా ముస్లింల సంతానోత్పత్తి రేటు పడిపోయిందని అన్నారు. 

ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ని తాను ఓ ప్ర‌శ్న అడగాలనుకుంటున్నాననీ, 2000 నుంచి 2019 వ‌ర‌కూ హిందువుల్లో 90 లక్షల మంది ఆడ పిల్ల‌ల‌ భ్రూణహత్యలు జ‌రిగాయ‌ని, అంత పెద్ద అంశంపై భగవత్ ఎందుకు మాట్లాడరని ప్ర‌శ్నించారు. కుమార్తెలను చంపడాన్ని ఖురాన్‌లో అతి పెద్ద నేరంగా అభివర్ణించారని ఒవైసీ అన్నారు. 

ముస్లింల్లో లింగ‌నిష్ప‌త్తి 1000 మందిమగపిల్లలకు 943 మంది ఆడ‌పిల్ల‌లు ఉన్నార‌నీ, కానీ హిందూవుల్లో 1000 మంది మ‌గ పిల్లలకు కేవ‌లం 913 మంది ఆడపిల్ల‌లు మాత్ర‌మే ఉన్నార‌ని అన్నారు. భగవత్ జీ ఈ ఫిగర్ గురించి ఎందుకు మాట్లాడ‌టం లేద‌నీ ప్ర‌శ్నించారు. ముస్లింల జనాభా పెరగడం లేదని ఒవైసీ అన్నారు. అరే జనాభా పెరుగుతోందని టెన్షన్ పడకండి. పెరగడం లేదు. ముస్లింల జనాభా తగ్గిపోతోంద‌ని అన్నారు. డేటాను ముందు ఉంచుకుని మాట్లాడాల‌ని ఆర్ఎస్ఎస్ చీఫ్ కు ఓవైసీ సూచించారు.

Scroll to load tweet…

ఇంత‌కీ మోహన్ భగవత్ ఏమ‌న్నారంటే..?

నాగ్‌పూర్‌లో బుధవారం జరిగిన సంప్రదాయ విజయదశమి వేడుకల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ డాక్టర్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. జ‌నాభా అసమతుల్యత భౌగోళిక సరిహద్దుల్లో మార్పుకు దారితీస్తుందని అన్నారు. జనాభా నియంత్రణ, మత ఆధారిత జనాభా సమతుల్యత అనేది విస్మరించలేని ముఖ్యమైన అంశమ‌నీ, 1947 విభజన, పాకిస్తాన్ ఆవిర్భావానికి మతం-ఆధారిత జనాభా అసమతుల్యతకు కారణమని పేర్కొన్నాడు.