పశ్చిమ బెంగాల్ బీర్భమ్ జిల్లాలో చోటుచేసుకున్న హింసను సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తును తాము స్వాగతిస్తున్నామని, కానీ, సీబీఐని బీజేపీ ఇన్‌ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. తాము ఆ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అవే నిజమైతే తాము ఆందోళన బాట పట్టడానికి రెడీగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చారు.
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీర్భమ్ హింస కేసులో సీబీఐ దర్యాప్తును స్వాగతిస్తున్నామని చెప్పారు. కానీ, ఆ దర్యాప్తులో బీజేపీ జోక్యం చేసుకోవాలని భావిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని అన్నారు. ఆందోళన బాట పట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నదని ఆమె ఆరోపించారు. బీర్భమ్ జిల్లాలో బొగ్తుయి గ్రామంలో జరిగిన హింస వెనుక ఏదో కుట్ర ఉన్నదనే తనకు తోస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తును సెంట్రల్ ఏజెన్సీకి అప్పగించడంలో తమకు అభ్యంతరం లేదని, ఆ నిర్ణయం సరైనదేనని తెలిపారు. కానీ, ఆ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ బీజేపీ మార్గదర్శకాలను పాటిస్తుందా? అనేదే తమ ఆందోళన అని వివరించారు. అదే జరిగితే తాము ఆందోళన బాటపడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఇదే విషయంపై టీఎంసీ ప్రతినిధి కునాల్ గోష్ కూడా మాట్లాడారు. కేంద్ర ఏజెన్సీ దర్యాప్తులో బీజేపీ ప్రమేయం ఉండే అవకాశం ఉన్నదని ఆయన అనుమానించారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీని బీజేపీ ప్రభావితం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఈ ఘటనపై సీబీఐ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా దర్యాప్తు చేస్తే తాము దాన్ని స్వాగతిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటికే సీబీఐని ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వచ్చాయని వివరించారు. అలాంటి ఏ చర్యనైనా తాము వ్యతిరకిస్తామని తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత హత్య జరిగిన మరుసటి రోజే అంటే ఈ నెల 22న కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు. ఇందులో ఎనిమిది మంది మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా ఉండటం గమనార్హం. వీరి పోస్టుమార్టం రిపోర్టు కూడా సంచలనంగా ఉన్నది. వారిపై ముందుగా భౌతిక దాడి జరిగినట్టు తేలింది. ఆ తర్వాతే వారిని సజీవ దహనం చేసినట్టు రిపోర్టు పేర్కొంది. బీర్భమ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. దర్యాప్తునకు పోలీసులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది. కానీ, కలకత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించాల్సిందిగా ఆదేశించింది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే పశ్చిమ బెంగాల్‌లో హింస పెచ్చరిల్లింది. ముఖ్యంగా రాజకీయ హత్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల హత్యలతో బెంగాల్ కొన్నాళ్లు హై టెన్షన్ పరిస్థితులు కొనసాగాయి. ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకు ఈ పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. కానీ, తాజాగా, మరోసారి బెంగాల్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓ తృణమూల్ కాంగ్రెస్ నేత హత్య జరిగిన మరుసటి రోజే బీర్భమ్ జిల్లాలో కొందరి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ మంటల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన పై ఇటీవలే బీజేపీ ఎంపీ రూపా గంగూలిలో పార్లమెంటులోని రాజ్యసభలో మాట్లాడుతూ భోరుమని విలపించారు. అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆమె అన్నారు. చుట్టుపక్కల వారూ ప్రాణ భయంతో పారిపోతున్నారని తెలిపారు.
