ప్రధాని మోడీపై పోటీ చేసేందుకు సిద్ధమే.. కానీ - కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
ప్రధాని నరేంద్ర మోడీపై వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై కూడా పోటీ చేయాలని ఉందని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. అలాగే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై రాష్ట్రంలోని విదిషాలో కూడా పోటీ చేయాలని ఉందని అన్నారు. శనివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘నరేంద్ర మోడీ, శివరాజ్ సింగ్ చౌహాన్ లను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ పార్టీ నన్ను రాజ్ గఢ్ నుంచి పోటీ చేయాలని కోరింది. అందుకే నేను ఇక్కడి (రాయ్ గఢ్) నుంచి బరిలో ఉంటాను. ’’ అని అన్నారు. పదేళ్లు (1993-2003) సీఎంగా ఉన్నప్పటికీ దిగ్విజయ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుంచి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయడం లేదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రశ్నించిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా.. పార్లమెంట్ ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదని, అయితే రెండుసార్లు ప్రాతినిధ్యం వహించిన రాజ్ గఢ్ స్థానం నుంచి తనను బరిలోకి దింపవచ్చని పార్టీ సంకేతాలు ఇచ్చిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే 2019 లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నియోజకవర్గం నుంచి చేశారు. కానీ బీజేపీ అభ్యర్థి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ అక్కడ విజయం సాధించారు.
దిగ్విజయ్ 1991లో రాజ్ గఢ్ నుంచి పోటీ చేశారు. 1993లో సీఎం అయ్యారు. తరువాత 1994లో ఆ లోక్ సభ స్థానానికి వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు లక్ష్మణ్ సింగ్ గెలుపొందారు. 2004 వరకు ఆయనే అక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. కానీ 2003లో లక్ష్మణ్ సింగ్ బీజేపీలో చేరారు. తరువాత వచ్చిన ఎన్నికల్లో దిగ్విజయ్ సన్నిహితుడు, కాంగ్రెస్ నేత నారాయణ్ సింగ్ అమ్లాబే లక్ష్మణ్ సింగ్ ను ఓడించారు. ఆ తర్వాత లక్ష్మణ్ సింగ్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.