సీఏఏ విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా ముస్లింలను తప్పుదోవ పట్టించారని, దానిపై హింసను ప్రేరేపిస్తున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

ఈ క్రమంలో ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎవరో తప్పుదోవ పట్టించడానికి మేమేమైనా చిన్న పిల్లలమా అంటూ కౌంటరిచ్చారు.

ఒక వేళ ఈ చట్టం ముస్లింలను టార్గెట్ చేయడానికి కానట్లయితే.. అందులో మతం ప్రస్తావన ఎందుకు చేశారని ఒవైసీ ప్రశ్నించారు. భాగవత్ చెబుతున్నదే నిజమైతే సీఏఏలో మతం ప్రస్తావన తొలగిస్తారా అని ఆయన నిలదీశారు.

మా భారతీయతను నిరూపించుకోవాల్సిన చట్టాలు పోయేదాకా మేం మళ్లీ మళ్లీ నిరసనలు చేస్తూనే ఉంటాం'' అని అసదుద్దీన్ తేల్చి చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతోన్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ సీఏఏపై తరచూ కామెంట్లు చేస్తోందని ఆయన ఆరోపించారు.

పూర్వాంఛల్ వాసులు అందరినీ చొరబాటుదారులుగా చిత్రీకరిస్తున్నారని, ఇంత కీలకమైన అంశంపై ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటని ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లింలకు అన్యాయం చేయడంలో బీజేపీతో సమాన పాత్ర కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకూ ఉందని ఆయన మండిపడ్డారు.