చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై గుక్కెడు నీళ్ల కోసం నోరు తెరిచి అంగలారుస్తోంది. చెన్నైకి నీరందించే నాలుగు రిజర్వాయర్లు కూడా ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటాయి. వర్షాలు లేవు. దాంతో చెన్నై ప్రజలు మంచినీళ్ల కోసం పడని కష్టాలు లేవు. 

తమిళనాడు అధికారులు అవసరమైన నీటిలో 40 శాతం మాత్రమే అందించగలుగుతున్నారు. నీటి కొరత ఐటి కంపెనీలను, ఫైవ్ స్టార్ హోటళ్లను, భారీ నివాస గృహాలను ముప్పు తిప్పలు పెడుతోంది. చెంబారంబాక్కం చెన్నైకి ప్రధానంగా నీరందించే రిజర్వాయర్ లో నీరు లేదు. రిజర్వాయర్ అడుగు బీటలు వారింది. 

నీరు సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి పళనిసామి అంటున్నారు. చెన్నైకి ప్రతి రోజు 800 మిలియన్ లీటర్ల జలం అవసరం కాగా చెన్నై మెట్రో వాటర్ సప్లై 525 మిలయన్ల నీటిని మాత్రమే అందించగలుగుతోంది. 

చెన్నై ప్రజల్లో ఎక్కువ మంది ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల మీద ఆధారపడుతున్నారు. ఇప్పటికే అధికంగా ఉన్న నీటి ట్యాంకర్ల ధరలో ప్రస్తుత తడిసిమోపడయ్యాయి. ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులు ధరలను రెండింతలు చేశారు. పైగా, సరఫరా చేయడానికి కూడా రోజుల తరబడి తీసుకుంటున్నారు. 

స్నానం చేయడం, దుస్తులు ఉతుక్కోవడం మాట దేవుడెరుగు తాగడానికి కూడా నీరు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాధులు సంక్రమించే ప్రమాదం కూడా లేకపోలేదని అంటున్నారు. 

ప్రతి రెండు రోజులకు ఒకసారి వచ్చే ప్రభుత్వ ట్యాంకర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్న తీరు వర్ణనాతీతం. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఏడు కుండల నీరు మాత్రమే లభిస్తోంది. 

చెన్నైకి అందించడానికి మెట్టూర్ డ్యామ్ నుంచి కడలూరులోని వీరనం సరస్సుకు నీటిని విడుదల చేసినట్లు పళనిసామి చెప్పారు. రెస్టారెంట్లు చాలా వరకు నీటి కొరతతో లంచ్ లు పెట్టడం లేదు.  చెన్నై చుట్టుపక్కల ఉన్న పుఝాల్, షోలవరం, కలివేలి, పులికాట్, మధురంతకం సరస్సులు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. 

చెన్నై వెలువల నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్ కు అతీగతీ లేదు. 2015లో వచ్చిన తుఫాను తాకిడికి, అకాల వర్షాలకు చెన్నై నీటితో తల్లడిల్లింది. కానీ ఇప్పుడు తాగడానికి కూడా నీరు కరువైంది. 

చెన్నైలోని వాటర్ బాడీస్ ఆక్రమణపై మద్రాసు హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తమిళనాడులోని సరస్సులు, జలాశయాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. 2015లో వచ్చిన తుఫాను కారణంగానే చెన్నై ప్రస్తుతం నీటి కొరతను ఎదుర్కుంటోందని నిపుణులు అంటున్నారు.  

water... water... everywhere
Drinking water no where