ఈ కాలం యువతకు సెల్ఫీ పిచ్చి కాస్త ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే ఈ సెల్ఫీ మోజులో పడి చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. అయితే.. తాజాగా.. ఇద్దరు అమ్మాయిలు కూడా సెల్ఫీ మోజుల పడి.. దాదాపు ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. సమయానికి రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉండటంతో.. ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చింద్‌వాడ జిల్లాలోని జునార్‌దేవ్ పట్టణానికి చెందిన ఆరుగురు యువతులు విహార యాత్ర కోసమని పెంచ్ నది వద్దకు వెళ్లారు. వారిలో ఇద్దరు యువతులు నదిలోకి దిగి సెల్ఫీ తీసుకుంటున్న క్రమంలోనే వరద ఉదృతి పెరిగింది. నదిలోకి దిగి సెల్ఫీ తీసుకునే క్రేజ్‌లో పడిన ఇద్దరు యువతులు.. నదిలో పెరుగుతున్న ప్రవాహాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా నది ప్రవాహంలోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

 

స్థానికులు కూడా ఇక ఆ ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు పోయాయనే భావించారు. అయితే..  ఇద్దరు యువతులు చిక్కుకున్నారని గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు.. గ్రామస్తుల సహాయంతో అతి కష్టం మీద వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. రెస్క్యూ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి వారిని రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కాగా.. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే.. నెటిజన్లు మాత్రం సదరు యువతులపై విరుచుకుపడుతున్నారు. అంత సెల్ఫీ పిచ్చి అవసరమా అంటూ మండిపడుతున్నారు. వారిని సమయానికి కాపాడిన రెస్క్యూ సిబ్బందిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.