ఇద్దరు వ్యక్తులు బంగారం దుకాణంలో చోరీకి ప్లాన్ వేశారు. ఈ చోరీ చేసే క్రమంలోనూ వారు కోవిడ్ రూల్స్ చక్కగా ఫాలో అవ్వడం గమనార్హం. మూతికి మాస్క్ పెట్టుకొని.. చేతులకు శానిటైజ్ రాసుకొని మరీ దుకాణంలోకి వచ్చారు. సెకన్ల వ్యవధిలోనే తమ వద్ద ఉన్న తుపాకీలు బయటకు తీసి బెదిరించి చోరీ చేశారు. ఆ లోపు మరో వ్యక్తి కూడా వచ్చి వీళ్లతో జాయిన్ అయ్యాడు. ఈ సంటన ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అలీఘర్ లోని ఓ బంగారం దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులు కస్టమర్స్ రూపంలో అక్కడికి అడుగుపెట్టారు. వెంటనే.. శానిటైజర్ కావాలంటూ అక్కడి దుకాణం దారుడిని అడిగారు. వారు శానిటైజర్ ఇవ్వగానే చేతులు శుభ్రం చేసుకొని వెంటనే తుపాకీతో దుకాణంలో ఉన్నవారిని బెదిరించారు. అనంతరం.. మరో వ్యక్తి కూడా వచ్చి వాళ్లతో  చేరడంతో.. ముగ్గురూ కలిసి దాదాపు రూ.40లక్షలు విలువచేసే బంగారు నగలను బ్యాగులో సర్దేశారు.

 

వీళ్లు దొంగతనం చేస్తున్న సమయంలో కొందరు కస్టమర్స్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. అయితే.. వాళ్లెవ్వరూ కనీసం అంగుళం కూడా అక్కడి నుంచి కదలలేదు. బంగారు నగలు తీసుకున్న తర్వాత ఓ దొంగ మనీ కౌంటర్ వద్దకు వెళ్లి.. అక్కడ ఉన్న దాదాపు రూ.40వేల నగదు కూడా తీసేసుకున్నాడు.

నిమిషాలలోనే చోరీ పూర్తి చేసి.. ఎంత వేగంగా వచ్చారో.. అంతే వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. కాగా.. ఈ ఘటన అంతా దుకాణంలోని సీసీటీవీ కెమేరాలో రికార్డు అయ్యింది. ఆ వీడియో ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.