మాజీ ఎంపీ కొడుకు.. ఫైవ్ స్టార్ హోటల్ ముందు తుపాకీతో  వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అతడి ప్రవర్తన పట్ల నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దిల్లీలోని  ఫైవ్ స్టార్ హోటల్‌ వద్ద బీఎస్పీ మాజీ ఎంపీ కుమారుడైన ఆశిష్‌ పాండే తుపాకీతో ఓ జంట పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. వారితో వాగ్వాదానికి దిగినట్లు వీడియోలో తెలుస్తోంది.

 

ఆశిష్‌తో ఉన్న మరో మహిళ అతడిని ఆపేందుకు ప్రయత్నించింది. ఆశిష్‌ ఆ మహిళను బెదిరిస్తూ, తిడుతూ ఉండడంతో హోటల్‌ సిబ్బంది కూడా అతడిని అక్కడి నుంచే పంపించే ప్రయత్నం చేసినట్లు వీడియోలో రికార్డైంది. ఆదివారం రాత్రి ఓ పార్టీ అయిపోయిన తర్వాత హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పది సెకన్ల ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో దిల్లీ పోలీసులు స్పందించారు. ఆశిష్‌ పాండేపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అతడిని అరెస్ట్‌ చేయనున్నట్లు వెల్లడించారు.