‘‘ మేడిపండు చూడు మేలిమైనుండు.. పొట్ట విప్పి  చూడు పురుగులుండు’ అనే పద్యం చిన్నప్పుడు  చదివే ఉంటారు. కొంచెం అటూ ఇటుగా ఆ  పద్యం నిజమయ్యే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కాకపోతే ఇక్కడ మేడిపండుకాదు.. వేరుశెనగ.. పొట్టలో ఉంది పురుగులు కాదు.. విదేశీ కరెన్సీ... విదేశాల నుంచి స్మగ్లింగ్ కోసం ఓ ముఠా వేసిన  ప్లాన్ ఇది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఎయిర్ పోర్టులో ప్రయాణికుల వద్ద ఉండే లగేజ్ ని స్కాన్ చేస్తుంటారు. ఆ సంగతి తెలిసిందే. అయితే.. ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి వద్ద లగేజ్ చెక్ చేస్తుంటే.. అతని వద్ద  వండిన మాంసం ముక్కలు, వేరు శెనగలు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. వాటిపై అనుమానంతో పరిశీలించి చూస్తే.. విదేశీ కరెన్సీ దొరకడం గమనార్హం.

Also Read శృంగారంపై మత బోధకుడి సూచన.. మగపిల్లాడు కావాలంటే..

దాదాపు రూ.45లక్షల  విలువైన విదేశీ కరెన్సీ లభించిందని సీఐఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. దుబాయికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించడానికి మురద్ అలీని అనే వ్యక్తి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం యొక్క టెర్మినల్ -3 వద్దకు చేరుకున్నాడు. అయితే అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా.. ఇవి వెలుగుచూశాయి.

 

ప్రయాణికుల సామాను భౌతిక తనిఖీల్లో… వండిన మటన్ ముక్కలు, వేరుశెనగ గుండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు..ఇతర తినదగిన వస్తువులలో అధిక మొత్తంలో విదేశీ కరెన్సీలు దాచినట్లు సిఐఎస్ఎఫ్ ప్రతినిధి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ హేమేంద్ర సింగ్ తెలిపారు. 

'అక్రమ రవాణా కోసం విదేశీ కరెన్సీని దాచడానికి ఇది ఒక ప్రత్యేకమైన, విచిత్రమైన మార్గం' అని సింగ్ అన్నారు. సౌదీ రియాల్, ఖతారి రియాల్, కువైట్ దినార్, ఒమాని రియాల్, యూరోలు ఈ తనిఖీల్లో భయటపడ్డాయి. స్వాధీనం చేసుకున్న ఈ క్యాష్ విలువ రూ .45 లక్షలు వరకు ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రయాణికుడుని అదుపులోకి తీసుకున్న సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది.. కరెన్సీలను దర్యాప్తు కోసం కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. పాపం ఎవరూ కనిపెట్టలేరులే అనుకున్నాడు.. అడ్డంగా దొరికిపోయాడు. అయితే.. అంత ఓపికగా వేరుశెనగ కాయల్లో బిస్కెట్ ప్యాకెట్లలో అమర్చడానికి వాళ్లకి ఎంత సమయంలో పట్టిందో ఆలోచించడానికే కష్టంగా ఉంది. దొరికితే దొరికాడు కానీ.. అతని తెలివికి మాత్రం మెచ్చుకోవాల్సిందే అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.