భారతదేశంలోని హిమాలయ ప్రాంతానికి భారీ భూకంపం ముప్పు పొంచివుందని హెచ్చరించారు భూభౌతిక శాస్త్రవేత్తలు. ఉత్తరాఖండ్ నుంచి నేపాల్ మధ్య ఉన్న మధ్య హిమాలయ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8.5 తీవ్రతతో భూకంపం చోటు చేసుకునే అవకాశం ఉందని బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ ఆధునిక శాస్త్రీయ పరిశోధనా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూగర్భ డేటా, భారతీయ భూ వైజ్ఞానిక పరిశోధనా సంస్థ, గూగుల్ ఎర్త్, ఇస్రో కార్టోశాట్-1 తీసిన చిత్రాల ఆధారంగా తాము ఈ విషయాన్ని చెబుతున్నామన్నారు. ఇదే ప్రాంతంలో క్రీ.శ 1315-1440 సంవత్సరాల మధ్య ఓ 8.5 తీవ్రతతతో భూకంపం సంభవించి, భారీ విధ్వంసాన్ని సృష్టించిందని.. దాని వల్ల 600 కిలోమీటర్ల మేర పొడవైన పగులు ఏర్పడిందని.. ఇది దేశరాజధాని ఢిల్లీకి లక్నోకి మధ్య ఉన్న దూరం కన్నా అధికమని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూమి అంతర్గత పొరల్లో ఏర్పడే కదలికలు, ఘర్షణల ఫలితంగా తీవ్ర ఒత్తిడి నెలకొనడం కారణంగా ఇప్పుడు మరోసారి అదే తరహా భూకంపం సంభవించవచ్చని.. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం సంభవించిందని... అది త్వరలో రానున్న భారీ భూకంపాన్ని కూడా సూచిస్తుందన్నారు.

కాగా 2015లో నేపాల్‌లో 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిని ఆధారంగా చేసుకుని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో బౌల్డర్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జియోలాజికల్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు 2016లో పరిశోధనలు చేశారు. మధ్య హిమాలయ ప్రాంతంలోని భూగర్భంపై ఒత్తిడి పెరుగుతూ వస్తోందని.. దీని వల్ల భవిష్యత్తులో భారీ భూకంపం సంభవిస్తుందని వారు తెలిపారు.