అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ ఇవ్వడం.. ముఖ్యమంత్రిగా తగదు అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆయనకు టీ ఆఫర్ చేశారు. ఈ రోజు అసోంలో కేజ్రీవాల్ మాట్లాడారు. 

గువహతి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అసోం రాష్ట్రంలో తొలి పొలిటికల్ ర్యాలీని నిర్వహించి మాట్లాడారు. అసెంబ్లీ లోపల మాట్లాడటం కాదు.. బయట తనపై ఆరోపణలు చేస్తే కేసు పెడతానని ఢిల్లీ సీఎంను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్‌ను కేజ్రీవాల్ పేర్కొంటూ.. గత ఏడేళ్ల నుంచి హిమంత బిశ్వ శర్మ కేవలం చెత్త రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడని విమర్శించారు.

హిమంత బిశ్వ శర్మపై వేరే రాష్ట్రాల్లో అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అసెంబ్లీ వెలుపల అరవింద్ కేజ్రీవాల్ అనాలని, అలా అంటే.. ఆయన రాజకీయ సహచరుడైన మనీష్ సిసోడియాపై పరువునష్టం దావా వేసినట్టే కేజ్రీవాల్ పైనా దావా వేస్తానని బెదిరించారు. కేజ్రీవాల్ పిరికివాడని ఆరోపించారు. ఆయన అసోం పర్యటన చేయడానికి ముందే ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేజ్రీవాల్ అసోంలో మాట్లాడారు.

‘హిమంత బిశ్వ శర్మ అలా అనడాన్ని నేను విన్నాను. నన్ను బెదిరిస్తూ.. నేను ఇక్కడికి వస్తే జైలులో పెట్టిస్తా అని అన్నారు. అసోం ప్రజలు అలాంటి వారు కాదు. వారు ఎంతో మర్యాదతో మెలుగుతారు. ఇలా బెదిరింపులు చేయరు. అసోం సంస్కృతి, సంప్రదాయాల నుంచి హిమంత బిశ్వ శర్మ నేర్చుకోవాలి’ అని కేజ్రీవాల్ అన్నారు.

Also Read: డేటా లీక్ కేసులో దర్యాప్తు ముమ్మరం.. 11 కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల నోటీసులు

‘నేను ఆయనను నా అతిథిగా ఢిల్లీకి ఆహ్వానిస్తున్నాను. నేను ఆయనకు టీ సర్వ్ చేస్తాను. ఢిల్లీని తింపి చూపిస్తాను. కానీ, ఆయన అలా బహిరంగంగా బెదిరింపులు చేయడం ఒక ముఖ్యమంత్రిగా తగదు’ అని వివరించారు. అలాగే, ప్రధాని విద్యార్హతలపైనా మరోసారి ప్రశ్నలు వేశారు.

‘మీకు ఒక విద్యావంతుడైన ప్రధాని కావాలా? వద్దా? అని నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. తక్కువ చదువుకున్న వ్యక్తి నేటి యాస్పిరేషనల్ యూత్‌ను లీడ్ చేయలేడని వివరించారు. గుజరాత్ కోర్టు తీర్పు తర్వాత కూడా ఆయన ప్రధాని మోడీ విద్యార్హతలను అడుగుతున్నారు.