ముంబై: కుమారస్వామి ప్రభుత్వానికి తాము బుద్ది చెబుతామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్షను ఎదుర్కోనున్నారు.

కుమారస్వామి ప్రభుత్వానికి పాఠం చెప్పేందుకే తాము ముంబైకి వచ్చినట్టుగా రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు.తాము ముంబైకి డబ్బుల కోసం రాలేదన్నారు. ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పేందుకే వచ్చామన్నారు.  

అన్ని పరిష్కారమయ్యాకే తాము బెంగుళూరుకు వెళ్తామని ఎమ్మెల్యేలు ప్రకటించారు.  ఇప్పటికే మూడు దఫాలు అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సీఎం కుమారస్వామిని ఆదేశించారు.

అయితే విశ్వాస పరీక్షపై చర్చ పూర్తి కాకుండా విశ్వాస పరీక్షను పూర్తి చేయలేమని స్పీకర్ ప్రకటించారు. సోమవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్   ఆదేశించారు.

ఒకవేళ సోమవారం నాడు విశ్వాసపరీక్షను పూర్తి చేసుకోకపోతే  కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సంకీర్ణ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను  ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని  రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. 

తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని సీఎం కుమారస్వామి  ఆరోపించారు.  ప్రభుత్వం మైనార్టీలో పడినందున గద్దె దిగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.