ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి ఎజెండాపై ఓటర్లు తమ విశ్వాసం ఉంచారని నొక్కిచెప్పడానికి ఇటీవలి కర్ణాటక గ్రామ పంచాయతీ పోల్ ఫలితాలను ఉదహరించాయన్నారు బీజేపీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు రాజీవ్ చంద్రశేఖర్.

ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన అబద్ధాలు , వంచన తో కూడిన ప్రతిపక్ష రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని ఆయన స్పష్టం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనను, పౌరసత్వ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా గతంలో చేసిన ఆందోళనను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 

దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల పరంపర నేపథ్యంలో తాను మాట్లాడుతున్నానని పేర్కొన్నారు రాజీవ్ చంద్రశేఖర్. అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎంఎల్‌సి ఎన్నికలు, గ్రామీణ సంస్థల ఎన్నికలు అయినా బిజెపి వాటిని గెలుచుకుందని అన్నారు.

కొన్ని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న అబద్ధాలు , వంచన రాజకీయాలకు వ్యతిరేకంగా, బిజెపికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని రాజీవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ , ముఖ్యమంత్రి యడియూరప్ప నాయకత్వంపై ప్రజలు నమ్మకాన్ని వుంచారని ఆయన అభిప్రాయపడ్డారు. 

వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ప్రజలు మద్దతు ఇస్తున్నారని రాజీవ్ పేర్కొన్నారు. నిరసనలు తగ్గించడానికి  రైతు సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో చిత్తశుద్ధితో ఉందని, రైతుల పట్ల పార్టీకి నిబద్ధత వుందని ఆయన స్పష్టం చేశారు.

ఇక రాష్ట్రంలోని 55.4 శాతానికి పైగా గ్రామ పంచాయతీలు బీజేపీ- మద్ధతుదారులతో వున్నాయని... 53 శాతం బీజేపీ కిందే వున్నాయని చెప్పారు. రైతులను తప్పుదోవ పట్టించడానికి ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పడం వల్లే ఇలాంటి ఫలితాలు వచ్చాయని రాజీవ్ వెల్లడించారు. 

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, పార్టీ 17 అసెంబ్లీ ఉప ఎన్నికలలో 14 గెలిచిందని, నాలుగు ఎంఎల్‌సీ స్థానాల్లో విజేతగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారని.. వారికి ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇస్తున్నాయని రాజీవ్ చెప్పారు.

అయినప్పటికీ బిజెపి దేశవ్యాప్తంగా అనేక ఎన్నికలలో సాధించిన ఫలితాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. వ్యవసాయ చట్టాలు సైతం మెజారిటీ మద్దతును పొందుతాయని నొక్కిచెప్పారు . అభివృద్ధి, సుపరిపాలన కావాలని భావిస్తున్న దేశ ప్రజలు మోడీని విశ్వసిస్తున్నారని చంద్రశేఖర్ అన్నారు.