తమిళనాడు అసెంబ్లీ  ఎన్నికల వేళ అన్నాడీఎంకే బహిష్కృత నేత, దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ఆమె బుధవారం ప్రకటించారు. డీఎంకే  ఓడించాలని అన్నాడీఎంకే కార్యకర్తలకు శశికళ పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలన తమిళనాడు రాష్ట్రంలో రాకుండా అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తికావడంతో జనవరి 27న విడుదలైన శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరిన ఆమెకు దారిపొడువునా అభిమానులు నీరాజనాలు పట్టారు.

చైన్నైకు చేరుకునే క్రమంలో అక్కడక్కడా ఆమె మీడియాతో మాట్లాడారు. అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. అమ్మకు తానే నిజమైన వారుసురాలినని సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని కోట్లాది మంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు.

శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి వస్తే పార్టీ బలోపేతం అవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.  అటు కూటమిలో ఉన్న బీజేపీ కూడా ఇదే విషయాన్ని అన్నాడీఎంకే వద్ద ప్రస్తావించింది.  

శశికళను పార్టీలోకి తీసుకోవడానికి పన్నీర్ సెల్వం ఒప్పుకున్నా, ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం ససేమిరా అంటున్నారు.  శశికళ పార్టీలోకి అడుగుపెడితే, అంతర్గతంగా మళ్ళీ విభేదాలు తలెత్తుతాయని, పార్టీలో మళ్ళీ చీలికలు వస్తాయని అంటున్నారు.  

పార్టీలో సగానికిపైగా శశికళ అనుకూల వర్గం ఉన్నది.  కానీ, పార్టీ ఆదేశాల మేరకు వారంతా నోరు మెదపడం లేదు.  ఒకవేళ పార్టీలోకి శశికళను ఆహ్వానిస్తే ఆమెకు పగ్గాలు అప్పగించాల్సి వస్తుంది.

ఒకవేళ పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పగ్గాలను కూడా చిన్నమ్మ తీసుకునే అవకాశం ఉంటుంది.  అందుకే పళనిస్వామి దీనికి అంగీకరించడం లేదని నిపుణులు అభిప్రాయం. ఇదే సమయంలో శశికళ మూడో కూటమికి మద్ధతు పలుకుతారనే ప్రచారం జరిగింది. అన్నాడింఎకె, డిఎంకె కూటముల్లోని అసంతృప్త  పార్టీలతో మూడో కూటమి ఏర్పాటు కానుంది.

ఈ కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్‌కుమార్‌ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయం వేడిగా వున్న సమయంలో శశికళ ఏకంగా పాలిటిక్స్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది.