Asianet News TeluguAsianet News Telugu

Vistara: వరుస ఘటనల కలకలం.. విస్తారా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ 

Vistara: గ‌త కొన్నిరోజులుగా పలు  భార‌త విమానయాన సంస్థ‌ల విమానాల్లో సాంకేతిక లోపాలు త‌లెత్తున్నాయి. తాజాగా వారణాసి నుండి ముంబైకి వెళుతున్న విస్తారా విమానానికి ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో  వారణాసిలో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది.

Vistara Flight To Mumbai Returns To Varanasi After Bird Hit
Author
Hyderabad, First Published Aug 5, 2022, 8:23 PM IST

Vistara: ఇటీవ‌ల‌ కాలంలో భార‌త విమానయాన సంస్థ‌ల‌కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్యలు  తీవ్ర‌మయ్యాయి. దీని కారణంగా ప‌లు విమానాలను దారి మళ్లించడం. లేదంటే.. ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌ చేయడం వంటి ప‌లు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గ‌త రెండు నెలలుగా భారతీయ‌ విమానయాన సంస్థల విమానాలతో పాటు. అంత‌ర్జాతీయ విమానాలు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నాయి. దీంతో విమాన ప్రయాణీకులకు గుబులు ప‌ట్టుకుంది. 

తాజాగా.. భార‌త విమానయాన సంస్థ‌ Vistara కు చెందిన‌ విమానం పెను ప్రమాదం నుంచి బయటపడింది. శుక్ర‌వారం నాడు వారణాసి నుంచి ముంబై వెళ్తున్న Vistara విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనతో  మ‌రోసారిగా భయానక వాతావరణం నెలకొంది. ఈ మొత్తం ఘటనపై DGCA ఓ ప్రకటన కూడా వెలువడింది. వారణాసి నుండి ముంబైకి వెళ్తున్న Vistara విమానం UK622 ను ఓ పక్షి  ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది.

దీంతో ఆ విమానాన్ని వారణాసి విమానాశ్రయంలో సురక్షితంగా ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశార‌ని DGCA తెలిపింది. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇన్‌స్పెక్షన్ అవసరం దృష్ట్యా.. ప్రయాణికులను ముంబైకి తీసుకెళ్లేందుకు ఢిల్లీ నుంచి వారణాసికి మరో విమానాన్ని పంపించారని తెలిపింది. ప్ర‌యాణీకుల‌ భద్రతను ప్రధాన ప్రాధాన్యతగా ఉంచడం, అటువంటి అనివార్య పరిస్థితుల్లో మా కస్టమర్‌లకు అసౌకర్యాన్ని తగ్గించడ‌మే మా నిరంతర ప్రయత్నమని Vistara తెలిపింది.

గతంలో కూడా విమానాల‌ను పక్షులు ఢీకొట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి.ఈ ఏడాది జూన్‌లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివృద్ధి పనులను పరిశీలించేందుకు వారణాసికి వచ్చారు. సీఎం యోగి హెలికాప్టర్  పోలీసు లైన్ నుండి లక్నోకు బయలుదేరింది. సుమారు 1500 అడుగుల ఎత్తులో వెళ్ళిన స‌మ‌యంలో హెలికాప్టర్ విండ్ షిల్డ్ ను  ఒక పక్షి ఢీకొట్టింది. దీని కారణంగా ఈ హెలికాప్టర్‌ను ముందుజాగ్రత్తగా.. తిరిగి పోలీసు లైన్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి నష్టం జరగలేదు. అనంతరం.. సీఎం యోగి రోడ్డు మార్గంలో బబత్‌పూర్‌ విమానాశ్రయానికి  బయలుదేరారు.

గ‌త నెల‌లో త‌ప్పిన విమాన ప్ర‌మాదాలు
 
జూలై 27: పదే పదే ఫిర్యాదులు రావడంతో DGCA 50% స్పైస్‌జెట్ విమానాలను నిషేధించింది

జూలై 19: ముంబై నుండి లేహ్ వెళ్తున్న GoFirst విమానంలోనూ, శ్రీనగర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న GoFirst విమానంలో ఇంజిన్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఆ విమానాల‌ను ర‌ద్దు చేశారు. 

జూలై 17: ఇండిగోకు చెందిన షార్జా-హైదరాబాద్ విమానం సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ చేయ‌బ‌డింది. 
 
జూలై 15: కొచ్చి-బహ్రెయిన్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం యొక్క కాక్‌పిట్‌లో చిన్న పక్షి దూరింది. 
 
జూలై 14: ఇంజన్ లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్త‌డంతో ఇండిగో చెందిన ఢిల్లీ-బరోడా విమానాన్ని జైపూర్‌కు మళ్లించారు. అక్కడ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్ చేశారు.  

జూలై 05: స్పైస్‌జెట్ చెందిన‌ ఢిల్లీ-దుబాయ్ విమానం యొక్క ఇంధన సూచిక విఫలమైంది

జూలై 05: స్పైస్‌జెట్‌కి చెందిన కాండ్లా-ముంబై విమానంలో 23,000 అడుగుల ఎత్తులో విండ్‌షీల్డ్‌ పగిలిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

జూలై 05: ఇండిగోకు చెందిన రాయ్‌పూర్-ఇండోర్ విమానం ల్యాండ్ అయిన తర్వాత పొగలు వచ్చాయి.

జూలై 05: విస్తారాకు చెందిన బ్యాంకాక్-ఢిల్లీ విమానంలో ఒక ఇంజన్ ఫెయిల్ అయింది, దీంతో ఆ విమానాన్ని ఎమ‌ర్జెన్సీ ల్యాండ్ చేశారు.  

Follow Us:
Download App:
  • android
  • ios