ముంబై: ముంబై నుంచి హైదరాబాదు రావాల్సిన విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం తప్పింది. ఆ సమయంలో విమానంలో 120 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. 

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన అరగంటకే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి ముంబై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

త్వరలో విడుదల కానున్న సైరా ప్రమోషన్ కోసం ఆయన ముంబై వచ్చారు. ఆ తర్వాత తిరిగి వస్తుండగా ఆ సంఘటన చోటు చేసుకుంది. చిరంజీవి సహా ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారు. 

విస్తారా (యూకె 869) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని, వారి కోసం మరో విమానానాన్ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు.